
శ్రీశైలం 4 గేట్లు, సాగర్ ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తివేత
నాగార్జునసాగర్/దోమలపెంట/నల్లగొండ: ఎగువ నుంచి కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. మంగళవారం జూరాల, సుంకేశుల నుంచి 1,57,373 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. దీంతో విద్యుదుత్పత్తి, ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 1,74,608 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 883 అడుగుల నీటిమట్టం వద్ద 204 టీఎంసీల నిల్వ ఉంది.
శ్రీశైలం జలాశయం నుంచి వస్తున్న వరదకు తోడు, స్థానికంగా కురిసే వర్షాలతో సాగర్ జలాశయానికి 1,86,258 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312,0450టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 589.50 అడుగులు (310.5510టీఎంసీలుగా) ఉంది. సాగర్ జలాశయం 18 గేట్లు 5 అడుగులు ఎత్తి 1,44,864 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నిండుకుండలా ఉదయ సముద్రం
పానగల్లు ఉదయసముద్రం చెరువు నిండుకుండలా ఉంది. ఈ రిజర్వాయర్‌కు ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోత ల ప్రాజెక్టు కాలువ ద్వారా నీరు వస్తోంది. ఈ చెరువు నుంచి పలు గ్రామాలకు తాగునీరు అందుతోంది.