
రామగిరి(నల్లగొండ): కన్న కూతురిపై అత్యాచారం జరగడానికి కారణమైన తల్లికి 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి మంగళవారం తీర్పు వెలువరించారు. నల్లగొండ పట్టణంలోని లైన్‌వాడకు చెందిన గ్యారాల శివకుమార్ బీటీఎస్‌కు చెందిన వసంతపురి యాదమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకొని, మైనర్ అయిన యాదమ్మ కూతురుపై కూడా కన్నేశాడు. యాదమ్మ సహకారంతో శివకుమార్ బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నంచగా తిరస్కరించింది. బలవంతంగా బాలిక దుస్తులు విప్పి వీడియోలు తీసి, శారీరకంగా అనుభవించాడు. శివకుమార్‌కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాధిత బాలిక 2023 మే 8న నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో తల్లి యాదమ్మ, శివకుమార్‌పై ఫిర్యాదు చేసింది.
పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోక్సో కోర్టు జడ్జి రోజారమణి మంగళవారం తుది తీర్పు వెలువరిస్తూ.. ఇద్దరిని దోషులుగా ప్రకటించింది. ఏ1గా ఉన్న గ్యారాల శివకుమార్ ఉదయం కోర్టుకు వచ్చినట్లే వచ్చి పారిపోయాడు. అతడు కోర్టుకు గైర్హాజరైనట్లుగా న్యాయస్థానం ప్రకటించి దోషిగా తేలుస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. తదుపరి కోర్టు ముందు హాజరుపర్చిన రోజు శిక్షను ఖరారు చేయడం జరుగుతుంది. ఏ2 యాదమ్మకు 22 ఏళ్ల జైలు శిక్ష, రూ.5000 జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు.
పదేళ్లు జైలు శిక్ష..
రామగిరి(నల్లగొండ), మర్రిగూడ: బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లికి చెందిన పోలె నరేష్ 2016 ఆగస్టు 22న అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక విషయం తన తల్లికి చెప్పడంతో ఆమె మర్రిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్‌ఐ కె. బలరాం పోలె నరేష్‌పై పోక్సో కేసు నమోదు చేయగా.. అప్పటి నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా జడ్జి రోజారమణి నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.
కారు డ్రైవర్‌కు..
కట్టంగూర్: ప్రమాదంలో కారుతో మహిళను ఢీకొని ఆమె మృతికి కారణమైన డ్రైవర్‌కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేలు జరిమనా విధిస్తూ నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ షేక్ ఆరిఫ్ మంగళవారం తీర్పు వెలువరించారు. కట్టంగూర్ ఎస్‌ఐ మునుగోటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2015 మార్చి 18న శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన బట్టా సుమన్ తన బంధువైన మందుల పరిమళను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామం నుంచి అయిటిపాములలో శుభకార్యానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో చెర్వుఅన్నారం క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా.. ఖమ్మం జిల్లా వేపకుంట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ అంగోతు కిశోర్‌కుమార్ హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో అజాగ్రత్తగా, అతివేగంగా వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మందుల పరిమళ తలకు తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. సుమన్ తండ్రి వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి ఆరు నెలల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని ఎస్‌ఐ తెలిపారు.
అత్యాచారం కేసులో 20 ఏళ్లు..
రామగిరి(నల్లగొండ): మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన వీరంశెట్టి సాంబశివ 2017 ఏప్రిల్ 15న అదే గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలైన బాలికను ఇంట్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రొసిక్యూటర్ వేముల రంజిత్‌కుమార్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి రోజారమణి నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడేలా సరైన ఆధారాలు సేకరించడంలో అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులుగా జె. రవీందర్, ఏ. రమేష్‌బాబు, జె. శివకుమార్ వ్యవహరించారు.