అచ్చంపేట: ఓటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ అధికారుల పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పాటు అంగన్‌వాడీ టీచర్లు, ఇతర సిబ్బంది అంతా సర్ విధుల్లోనే నిమగ్నమయ్యారు. ఫలితంగా సాధారణ కార్యాలయ పనులు, పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి రోజువారీ వ్యవహారాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. పలు కార్యాలయాల్లో సిబ్బంది లేక కుర్చీలన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. సర్ ప్రక్రియను సాకుగా చూపుతూ.. కొందరు అధికారులు, సిబ్బంది విధులకు డుమ్మా కొడుతున్నారని తెలుస్తోంది. ప్రజలు తమ సమస్యలపై కార్యాలయానికి వస్తే.. సర్ ప్రక్రియ ముగిసే వరకు సార్ రారనే సమాధానం సిబ్బంది నుంచి వస్తోంది. ఈ క్రమంలో అచ్చంపేట మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో పుర కమిషనర్ అనుసరిస్తున్న తీరుపై స్థానిక ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ తీవ్రంగా మందలించారు. గత జూన్ 5న పట్టణాభివృద్దికి రూ. 25కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయగా.. సీడీఎంఏ నుంచి ప్రతిపాదనలు పంపాలని ఆగస్టు 26న మున్సిపల్ కార్యాలయానికి లేఖ అందింది. ఆ లేఖ అంది నెలరోజులు గడిచినా ప్రతిపాదనలను ఎందుకు పంపించలేదని ప్రశ్నించగా.. సర్ ప్రక్రియ, ఇతరత్రా కారణాలు చెప్పినట్లు తెలిసింది.
పండింగ్‌లో పనులు..
ఇందిరమ్మ ఇళ్లు, జనన, మరణ ధ్రువీకరణ, మ్యుటేషన్లు, భవన నిర్మాణ అనుమతులు తదితర పనుల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అధికారులు అందుబాటులో లేకుండా పోతుండటంతో ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. అలాగే పరిపాలనా వ్యవస్థలు, విభాగాల పునర్వ్యవస్థీకరణ, పెరుగుతున్న పౌర ఫిర్యాదులు వంటి అంశాలు సవాళ్లుగా మారాయి. ఓటరు జాబితా సవరణ కీలకమైనదే అయినప్పటికీ.. ప్రజలకు అవసరమైన సేవలు ఆగకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్ విధులకు వెళ్లిన సిబ్బందికి ప్రత్యామ్నాయంగా వారి పనులుచేసే ఇతర సిబ్బందిని కేటాయించడం, ముఖ్యమైన పౌర సేవలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక డెస్క్‌లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల్లో పడకేసిన కార్యకలాపాలు
సర్ ప్రక్రియలో అధికారులు, సిబ్బంది తలమునకలు
కార్యాలయాల్లో ముందుకు కదలని ఫైళ్లు
ప్రజలకు తప్పని ఇబ్బందులు
ప్రజలకు ఇబ్బందులు లేకుండా..
సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందజేసిన ఓటర్ల హియరింగ్, ఫీల్డ్ విజిట్‌లో ఉండటంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పడు సర్ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో అందరికీ అందుబాటులో ఉంటున్నాం. రూ. 25కోట్లకు సంబంధించిన అభివృద్ది పనుల ప్రణాళిక కూడా సిద్ధంచేసి సీడీఎంఏకు పంపించాం. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పరిపాలన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. మున్సిపల్ కార్మికులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు జీతభత్యాలు చెల్లిస్తున్నాం.
– మురళి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట


