● జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన
సంబరాలు
● భక్తిశ్రద్ధలతో శమీ పూజలు
కందనూలు: విజయదశమి పర్వదినాన్ని మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. శమీ శమయతే పాపం.. శమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధరుర్ధారీ రామస్య ప్రియదర్శనం అని పఠిస్తూ.. శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తెల్లవారుజాము నుంచే దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం జమ్మిచెట్టు వద్దకు ఊరేగింపుగా చేరుకుని ప్రత్యేక పూజల అనంతరం ఒకరినొకరు జమ్మిపత్రం పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, సరితారెడ్డి దంపతులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం శమీ పూజ చేశారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వివరించారు. విజయదశమి పర్వదినం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఒక ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేశ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
శమీ వృక్షానికి పూజలు చేస్తున్న ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి
జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్‌పై దసరా ఉత్సవాల్లో పాల్గొన్న జనం


