నాగర్‌కర్నూల్: జిల్లాకేంద్రమైన నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసింది. మున్సిపాలిటీ పరిధిలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణాలు పూర్తికాని ప్రాంతాల్లో మిగిలిన పనులను చేపట్టడంతో పాటు సీసీరోడ్ల నిర్మాణానికి ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలనశాఖ ఈ నెల 22న జీఓ ఆర్టీ నంబర్ 953ను జారీ చేసింది.
రెండు విభాగాలకు సమానంగా నిధులు..
గతంలో జారీ చేసిన జీఓ ఆర్టీ నంబర్ 872 ప్రకారం మున్సిపాలిటీలో యూజీడీ పనుల కోసం అదనంగా రూ.40 కోట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, తెలంగాణ పట్టణ ఆర్థిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్‌ఐడీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చేసిన ప్రతిపాదనల మేరకు నిధుల వినియోగంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం రూ.40 కోట్లలో రూ.20 కోట్లను యూజీడీ వ్యవస్థ అందుబాటులో లేని ప్రాంతాల్లో మిగిలిన పనులకు, మరో రూ.20 కోట్లను సీసీ రోడ్ల నిర్మాణానికి కేటాయించారు. పట్టణంలో భూగర్భ డ్రెయినేజీ పనులతో పాటు రహదారుల అభివృద్ధికి కూడా నిధులు వినియోగించేలా ఉత్తర్వుల్లో మార్పులు చేశారు.
అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీకి రూ.20కోట్లు.. సీసీరోడ్లకు రూ.20కోట్లు కేటాయింపు
హర్షణీయం..
మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.40కోట్లు కేటాయించటం హర్షించదగ్గ విషయం. ఇందుకు చొరవ చూపిన ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి కృతజ్ఞతలు. ఈ నిధులతో పట్టణంలోని అవసరమైన చోట మురుగు కాల్వలు, సీసీరోడ్ల నిర్మాణం చేపడుతాం. – తీగల సునీంద్ర,
మున్సిపల్ చైర్మన్, నాగర్‌కర్నూల్


