● సాగునీటి ప్రాజెక్టుల పనులను
పూర్తిచేయడమే లక్ష్యం
● ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి
జూపల్లి కృష్ణారావు
నార్లాపూర్
రిజర్వాయర్ తూము నుంచి ఎల్లూరు
రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ రూరల్: ఎంజీకేఎల్‌ఐ ద్వారా అదనంగా మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం కొల్లాపూర్ మండలం బోడబండ తండా సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్ తూము నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌లోకి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టు నుంచి కేఎల్‌ఐకి సంబంధించిన ఎల్లూరు రిజర్వాయర్‌లోకి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం ద్వారా అదనంగా మరో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. నార్లాపూర్ నుంచి ఏదుల వరకు కాల్వల పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. మార్గమధ్యంలో మూడు చోట్ల తండు తవ్వకాలు చేపట్టాల్సి ఉండటంతో పాటు బ్రిడ్జీల నిర్మాణం కొనసాగుతోందన్నారు. కొన్ని ప్రాంతాల్లో రాతి నేల ఉండటంతో తవ్వకాలకు సమయం పడుతోందని ఆయన వివరించారు. అవి పూర్తి కాకుండా నీటిని విడుదలచేస్తే ముందుకు తీసుకెళ్లడం సాధ్యంకాదని స్పష్టం చేశారు. కాల్వ నిర్మాణం పూర్తిచేసి నీటిని సజావుగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇంకా నాలుగు నెలల సమయం పడుతుందన్నారు. ప్యాకేజీ–3 పనులను బీఆర్‌ఎస్ ప్రభుత్వమే పూర్తిచేసి ఉంటే, ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మాజీ మంత్రి కేటీఆర్, నిరంజన్‌రెడ్డితో సహా బీఆర్‌ఎస్ నాయకులు పాలమూరు ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోకుండా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన అన్నారు. ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించి, వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని సూచించారు. గాలి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. అసంపూర్తి పనులను పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం మిషన్ భగీరథ పథకం పంపహౌజ్‌లో అధికారులతో మంత్రి సమీక్షించారు. సమావేశంలో కొల్లాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి, వైస్‌చైర్మన్ రహింపాషా, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.
● కొల్లాపూర్ మండలం సోమశిలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మంత్రి జూపల్లి కృష్ణారావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటలక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ రామకృష్ణ, ఆర్మీ వెంకటస్వామి, రామ్మోహన్ పాల్గొన్నారు.


