ఇంటింటికి తిరుగుతూ..
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అంగన్‌వాడీ సిబ్బందితో ప్రతి ఇంటికి పోషణ సందేశం చేరవేసేందుకు కార్యాచరణ రూపొందించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి ఐసీడీఎస్ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వరకు పోషణపై చైతన్య కార్యక్రమాలు, ఆరోగ్య పరీక్షలకు క్యాంపులు నిర్వహించాల్సి ఉంటుంది. జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడం, చక్కెర, ఉప్పు, నూనె వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడుతారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో గ్రామీణ స్థాయిలో ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించి.. ఆత్మ నిర్భరతను పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రత్యేక కార్యక్రమాలు..
పోషణ మాసంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పిల్లల ఎత్తు, బరువు, కొలతలు సేకరించడం, గర్భిణుల బరువు, భుజం కొలతలు తీసుకోవడం, పోషకాహారంపై అవగాహన కల్పించి రోగ నిరోధక శక్తి పెంచడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. తక్కువ బరువు ఉన్న పిల్లలకు వైద్య పరీక్షలు, మందులు, ఉడికించిన కోడిగుడ్డు, మురుకులు, బాలామృతం ప్లస్ పంపిణీ చేయడంతోపాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పండ్లు, ఆకుకూరలు, ప్రదర్శన, చేతులను శుభ్రంగా కడుక్కునే విధానాన్ని వివరించడంతోపాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటు, సీ విటమిన్ అధికంగా ఉండే పండ్లతోటల పెంపకం, ఆరోగ్యం కోసం యోగాసనాలపై అవగాహన కల్పిస్తారు.
అచ్చంపేట/ కందనూలు: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహార విలువలపై పోషక మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాకారంతో ఈ నెల 9న ప్రారంభమై ఈ కార్యక్రమం అక్టోబర్ 8వ తేదీ వరకు కొనసాగనుంది. గర్భిణుల ఆరోగ్య రక్షణ, రక్తహీనత నివారణ, పిల్లల ఎదుగుదల, పర్యవేక్షణ, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 20 మండలాలు ఉండగా.. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, బల్మూర్, కొల్లాపూర్, కల్వకుర్తి ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 1,131 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో గర్భిణులు 4,483 మంది, బాలింతలు 2,813 మంది, ఆరేళ్లలోపు చిన్నారులు 40,607 మంది ఉన్నారు.
60 డిగ్రీల కోణంలో..
గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారుల భజం చుట్టు కొలతల విధానాన్ని అనురిస్తున్నారు. భుజం వృద్ధి ద్వారా గర్భిణులతోపాటు వారి గర్భంలో ఉన్న శిశువు పెరుగుదల, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తెలుసుకుంటున్నారు. నిర్వాహకులకు ఇందుకోసం కొలతల టేపులు సైతం అందించారు. గర్భిణులు, పిల్లల ఎడమ భుజాన్ని 60 డిగ్రీల కోణంలో వంచి తర్వాత ఎడమ చేతి చివర భాగం వరకు ఎంత పొడవు ఉందో గుర్తిస్తున్నారు. అందులో సగం భాగాన్ని గుర్తించి అక్కడ చుట్టూ కొలత తీసుకుంటున్నారు. తద్వారా ఆరోగ్య పరిస్థితిని బేరీజు వేసి పోషకాహార లోపాన్ని గుర్తిస్తారు. కిశోర బాలికల్లోనూ ఇదే విధానం అనుసరించి కొనసాగిస్తారు.
ఈ నెల 9 నుంచి పోషకాహారంపై విస్తృత ప్రచారం
పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు నెలరోజులపాటు కార్యక్రమం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ
సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న టీచర్లు
ఆరోగ్య పరీక్షలకు క్యాంపులు సైతం ఏర్పాటు


