కందనూలు: ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యంతో తల్లికడుపులోనే శిశువు మృతిచెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామానికి చెందిన జగన్‌తో కలిసి భార్య పార్వతి మూడో కాన్పునకు ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటుంది. ప్రసవ సమయం దగ్గర పడటంతో టిఫా స్కానింగ్, ఇతర వైద్యపరీక్షలు నిర్వహించి రిపోర్టుల ఆధారంగా అంతా బాగానే ఉందని వైద్యులు, నర్సు తెలిపారు. అయితే ఆదివారం ఆస్పత్రిలో చేరిన పార్వతి.. సోమవారం ఉదయం ఆపరేషన్ అనంతరం గర్భంలోనే శిశువు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణికి డయాబెటిస్ ఉన్న విషయం ముందుగానే తెలిసినా.. సరైన వైద్యం అందించలేదని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ప్రైవేటు ఆస్పత్రులపై అధికారుల పర్యవేక్షణ పెంచాలని, ఈ ఘటనపై అధికారులు పూర్తిస్థాయి విచారణ జరపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


