కల్వకుర్తి రూరల్: రైతుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని భరించి రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు సరఫరా చేస్తుందని, అయితే కొంతమంది రైతులు సబ్సిడీ విత్తనాలను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతున్నారని, విత్తనాలు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని రైతువేదిక ఆవరణలో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్స్ పథకంలో భాగంగా 1,380 మంది రైతులకు 1,180 క్వింటాళ్ల వేరుశనగ సబ్సిడీ విత్తనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇదిలా ఉండగా.. కొంతమంది రైతులు కల్వకుర్తి ప్రాంతంలో విద్యుత్ కోతలు లేకుండా 24 గంటలు రైతులకు సరఫరా చేయాలని వినతిపత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ సరఫరా 12 గంటలు మాత్రమే వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో సమస్యలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీసింగ్, ఆత్మ రెవెన్యూ డివిజన్ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షానావాజ్ ఖాన్, మార్కెట్ డైరెక్టర్ రమాకాంత్‌రెడ్డి, నాయకులు సుదర్శన్‌రెడ్డి, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


