కందనూలు: జిల్లాలో సర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జారీ, హియరింగ్, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులతోపాటు మీడియాకు వెల్లడిస్తూనే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్‌పాటిల్ అన్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్ని జిల్లాల అధికారులతో నిర్వహించిన వీసీలో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు చెన్నయ్య, సలోని ఛాబ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నోటీసుల జారీ, పెండింగ్‌లో ఉన్న నోటీసులు, హియరింగ్‌ల నిర్వహణ, ఫారం–6, 7, 8 దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ నోటీసులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. బీఎల్‌ఓలు, బీఎల్‌ఏల సహాయంతో ఓటర్లకు నోటీసులు సక్రమంగా అందేలా చూడాలని, నోటీసుల జారీలో పూర్తి పారదర్శకత పాటించాలని చెప్పారు. విదేశాల్లో ఉన్నవారికి నోటీసులు జారీ అయిన సందర్భంలో నిబంధనల ప్రకారం వారి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసి, వివరాలను నమోదు చేయాలన్నారు. అనంతరం జిల్లాలో సర్ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారి సూచనలు, మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
● జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)లో తప్పనిసరిగా నమోదు కావాలని కలెక్టర్ చెప్పారు. మండల, డివిజన్, క్లస్టర్, గ్రామ స్థాయిల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని ఎఫ్‌ఆర్‌ఎస్ పరిధిలోకి తీసుకురావాలని, సిబ్బంది నమోదు ప్రక్రియను ఈ నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు.
● సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, పునరావాసం– పునరావాస పునరుద్ధరణ (ఆర్‌అండ్‌ఆర్) పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ సంజయ్‌జాజుతో కలిసి మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.


