అమ్మకే అక్షరమాల.. నాన్నకు? | - | Sakshi
Sakshi News home page

అమ్మకే అక్షరమాల.. నాన్నకు?

Sep 8 2026 1:59 AM | Updated on Sep 8 2026 1:59 AM

మహిళలను 100 శాతం అక్షరాస్యులుగా చేస్తాం..

మహిళా సంఘాల్లో చదువు రాని సభ్యులకు.. అదే సంఘాల్లో చదువుకున్న మహిళలతో బోధన అందించేలా ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రతి మార్చి, ఆగస్టు నెలల్లో రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తున్నాం. మహిళలను 100 శాతం అక్షరాస్యులుగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.

– శ్రీనివాస్‌, వయోజన విద్య,

ఉమ్మడి జిల్లా అధికారి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: చదువు వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తివంతమైన సాధనం. అక్షరాస్యతతో సమాజంపై అవగాహన పెరగడంతో పాటు హక్కులు, బాధ్యతలపై చైతన్యం వస్తుంది. అయినా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిరక్షరాస్యత సమస్య పూర్తిగా తొలగలేదు. వయోజనులను అక్షరాస్యులుగా మార్చేందుకు గతంలో ‘సాక్షర భారత్‌’ వంటి కార్యక్రమాలు అమలు చేసినా.. ప్రస్తుతం అవి అంతగా కనిపించడం లేదు. ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. ప్రధానంగా మహిళా సంఘాల సభ్యులకే అక్షరాలు నేర్పించడంపై దృష్టి సారిస్తోంది. దీంతో నిరక్షరాస్యులుగా ఉన్న పురుషుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మంగళవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

ప్రస్తుతం ‘అమ్మకు అక్షరమాల’

వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గత ఏడాది నుంచి ప్రభుత్వం ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. సెర్ప్‌, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహిళా సంఘాల్లో 7 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న సభ్యులను గుర్తించి.. చదువు రాని ఇతర సభ్యులకు బోధించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇలా ఒక మహిళ మరో మహిళకు చదువు చెప్పే విధానంలో అక్షరాస్యతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ)ను ప్రతి మార్చి, ఆగస్టు నెలల్లో నిర్వహించనున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి మూడో తరగతి ఉత్తీర్ణతకు సమానమైన ధ్రువీకరణ పత్రం అందజేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 1,63,607 మంది మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.

7.78 లక్షల మంది నిరక్షరాస్యులు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 7,78,142 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఇందులో 2,99,907 మంది పురుషులు, 4,78,235 మంది మహిళలు ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళా నిరక్షరాస్యుల సంఖ్య 1,78,328 అధికం. జిల్లా వారీగా చూస్తే గద్వాల జిల్లాలో అత్యధికంగా 70,619 మంది పురుషులు నిరక్షరాస్యులుగా ఉన్నారు. నారాయణపేటలో అత్యల్పంగా 37,461 మంది ఉన్నారు. అయితే ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం మహిళా సంఘాల సభ్యులకే పరిమితం కావడంతో.. నిరక్షరాస్యులుగా ఉన్న పురుషులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ లేకపోవడం గమనార్హం. సమాజంలో నిరక్షరాస్యత పూర్తిగా నిర్మూలించాలంటే మహిళలతో పాటు పురుషులపైనా సమానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ఉమ్మడి జిల్లాలో పూర్తిగా తొలగని నిరక్షరాస్యత

‘సాక్షర భారత్‌’కు బదులు ‘అమ్మకు అక్షరమాల’

మహిళా సంఘాల సభ్యులకే పరిమితమైన అక్షరాస్యత కార్యక్రమం

ఉమ్మడి జిల్లాలో 7.78 లక్షల మంది నిరక్షరాస్యులు.. ఇందులో 2.99 లక్షల మంది పురుషులు

నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

పర్యవేక్షణలోనూ ఇబ్బందులు

మహిళా సంఘాల సభ్యులకు అక్షరాస్యత బోధన, పర్యవేక్షణ బాధ్యతలను డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోని సిబ్బందే చూస్తున్నారు. గ్రామస్థాయిలో వీఓఏలు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుండగా.. మండల స్థాయిలో ఏపీఎంలు, క్లస్టర్‌ స్థాయిలో క్లస్టర్‌ కోఆర్డినేటర్లు పర్యవేక్షిస్తున్నారు. మహిళా సంఘాల కార్యకలాపాలతో పాటు అక్షరాస్యత కార్యక్రమాన్ని కూడా వీరే చూడాల్సి రావడంతో పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు ఒకే కోఆర్డినేటర్‌ ఉండటంతో ఐదు జిల్లాల కార్యక్రమాలను పర్యవేక్షించడం కష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రతి గ్రామంలో వయోజన విద్యా కేంద్రాలు, ప్రత్యేక బోధనా సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం, పరిమిత నిధులతో కార్యక్రమాలు కొనసాగుతుండటంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement