అచ్చంపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మొండిచేయి చూపుతోందని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట సమన్వయకర్త మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌స్టేషన్ ఎదుట నిరసన చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో మూడు అమలు చేసి, 30 హామీలను ఎగ్గొట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన హామీలపై చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఆయన సవాల్ విసిరారు. అచ్చంపేట కోసం ఒక ప్రాజెక్టునైనా సాధించారా అని ప్రశ్నించారు. నల్లమల ముద్దుబిడ్డనని పదేపదే చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చారో, ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కొడంగల్, కొండారెడ్డిపల్లి ప్రాంతాలకు ఎన్ని నిధులు ఇచ్చారు? అచ్చంపేటకు ఎన్ని నిధులు కేటాయించారని శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ విలువలు కలిగిన నాయకుడని, ఆయనపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు.
అచ్చంపేటలో కౌంట్‌డౌన్..
అచ్చంపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ బీమా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో పోకల మనోహర్, తులిసీరాం, నరసింహ గౌడ్, రమేష్‌రావు, అమీనోద్దీన్, మన్నుప్రసాద్ పాల్గొన్నారు.


