కందనూలు: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్‌లో బాధితుల నుంచి ఎస్పీ 11 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 5 భూమికి సంబంధించినవి, ఒకటి భార్యభర్తల గొడవ, 5 తగు న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదులు అందించారని చెప్పారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ చెప్పారు.
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల పరిధిలోని అంగన్‌వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి పాండునాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు http://wdcw.tg.nic.in అనే వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్ 8 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కనులపండువగా జములమ్మ ఎదుర్కోళ్ల ఉత్సవం
గద్వాల న్యూటౌన్: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాలు సోమవారం కనులపండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ధ్వజారోణం, గణపతి పూజ చేశారు. సాయంత్రం చేపట్టిన ఎదుర్కోళ్ల ఉత్సవం వైభవంగా సాగింది. అమ్మవారిని, స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించి, జమ్మిచేడులోని ఆంజనేయస్వామి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా ఎదుర్కోళ్లు నిర్వహించారు. అక్కడి నుంచి ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగిస్తు ఆలయానికి తీసుకొచ్చారు. పోతురాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలతో సందడి నెలకొంది. ఆలయ ఈఓ పురందర్‌కుమార్, మాజీ చైర్మన్లు సతీష్, వెంకట్రాములు ప్రత్యేక పూజలు చేశారు.
నేడు కల్యాణ మహోత్సవం
ఏటా శ్రావణ మాసంలో చివరి మంగళవారం అంగరంగ వైభవంగా అమ్మవారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా రకరకాల పుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. భారీ కల్యాణ వేదిక, భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12:15 గంటలకు జరిగే కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకురానున్నారు. మున్సిపల్ చైర్మన్ తుమ్మల జయలక్ష్మితో పాటు జిల్లాలోని ప్రముఖులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
4 యూనిట్లలో
విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. సోమవారం ఎగువన 2 యూనిట్ల నుంచి 78 మెగావాట్లు, 102.277 మి.యూ., దిగువన 2 యూనిట్ల నుంచి 80 మెగావాట్లు, 88.880 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 191.157 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు.


