బల్మూర్/అమ్రాబాద్/మన్ననూరు/లింగాల: ఎస్‌ఐఆర్ నోటీసుల ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనల ప్రకారం నిర్వహించాలని సబ్ కలెక్టర్ సలోనిచోప్రా అధికారులను ఆదేశించారు. ఆదివారం బల్మూర్ మండల కేంద్రంతో పాటులోని అనంతవరం, అమ్రాబాద్ మండల కేంద్రంతో పాటు మన్ననూర్, లింగాల మండల కేంద్రంలో పర్యటించిన అదనపు కలెక్టర్ ఎస్‌ఐఆర్ నోటీసుల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, బీఎల్‌ఓలతో ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఫామ్–6 లో వచ్చిన దరఖాస్తుల సంఖ్య, వాటి పరిశీలన తీరుపై ఆరా తీశారు. ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ శాతాన్ని పరిశీలించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నోటీసుల జారీ, దరఖాస్తుల పరిశీలన తదితర ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీకాంత్, వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్లు రాములు, కృష్ణాజీ, ఎస్‌ఐఆర్ సూపర్‌వైజర్ అఖిల్, ఏఆర్‌ఐ అనిల్, జీపీఓ భాస్కర్, బీఎల్‌ఓలు యశోద, రాణి, మాసమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు.


