కందనూలు: కల్యాణలక్ష్మితోపాటు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రద్దు చేస్తే ఆడబిడ్డల ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని తన నివాసం నుంచి గాంధీ పార్కు వరకు ర్యాలీ నిర్వహించి.. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని ఎన్నో పథకాలను ప్రకటించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక ఉన్న పథకాలకు మంగళం పాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి పేదింటి బిడ్డల కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను అందించడంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి ఏ పార్టీ వారో తెలుసుకొని సంతకం పెడుతున్నారని ఆరోపించారు. కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పుడు చేతులెత్తేశారని, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను రద్దుచేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా నుంచే కాంగ్రెస్ పతనం మొదలైందని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం ఏ ఒక్కరోజు కూడా రైతులకు వ్యవసాయానికి సరిపడా కరెంటు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. అనంతరం ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ఆర్డీఓ అర్చనకు వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్ ధర్నాలో పోలీసులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్డీఓ కార్యాలయం వద్ద కార్యకర్తలు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. చివరికి ఆర్డీఓ అర్చన బయటకు వచ్చి వినతిపత్రం తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.


