నాగర్‌కర్నూల్ రూరల్: ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, జిల్లాకేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్ సెంటర్లు ఏర్పాట్లు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు అన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో అనేక మంది పేద విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా.. సరైన వసతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాకేంద్రంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తే వారందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. నల్లమల ప్రాంతంలో కాగితం పరిశ్రమ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నా.. జిల్లావాసి, సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యాహక్కు చట్ట ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం పేదలకు ఉచిత సీట్లు కేటాయించాల్సి ఉండగా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకారం యువతకు జాబ్ క్యాలెండర్ అమలు చేసి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగులకు రూ.5 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు ఆంజనేయులు, శ్రీనివాసులు, రామయ్య, శివవర్మ, అశోక్, కాశన్న, నాగరాజు, సైదులు, మల్లేష్, నాగరాజుగౌడ్, మధు, తారాసింగ్ తదితరులు పాల్గొన్నారు.


