విధులపై నిర్లక్ష్యం..
అప్పులు చేసి కుటుంబ పోషణ..
జిల్లాలో 17 లైబ్రరీలకు ముగ్గురు మాత్రమే రెగ్యులర్ సిబ్బంది
కందనూలు: ప్రజలకు విజ్ఞానం, విద్యార్థులకు విద్య, నిరుద్యోగులకు పోటీ పరీక్షల సమాచారం అందించాల్సిన గ్రంథాలయాలు సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మనిషి జ్ఞానం సంపాదించడంలో గ్రంథాలయాల పాత్ర కీలకం. ప్రభుత్వాలు పట్టణం, మండలంలో గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది. కానీ, మౌళిక వసతులు కల్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. కనీసం పుస్తకాలు, కుర్చీలు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు లేక పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పేద అభ్యర్థులు, ఇతర పుస్తకాలు చదివే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 17 గ్రంథాలయాలు ఉండగా.. వాటి నిర్వహణకు కేవలం ముగ్గురు రెగ్యులర్ సిబ్బంది, ఐదుగురు పార్ట్‌టైం సిబ్బందితో మాత్రమే నడుస్తున్నాయి. జిల్లాలోని గ్రంథాలయాలకు సంబంధించి పుస్తకాల నిర్వహణ, పాఠకులకు అవసరమైన సేవలు అందించడం, రికార్డుల నిర్వహణ, పుస్తకాల జారీ, తిరిగి స్వీకరణ వంటి అనేక పనులను పరిమిత సంఖ్యలో ఉన్న సిబ్బంది నిర్వహించాల్సి వస్తోంది. దీంతో కొన్ని గ్రంథాలయాల్లో సిబ్బంది లేక సేవలు అందించడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి తోడు గ్రంథాలయాలకు నీరు, కరెంట్, పేపర్, నెట్ బిల్లులు రాక ఉద్యోగులు తమ జీతంలో నుంచి వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది.
జిల్లాలో 17 లైబ్రరీలకు గాను 17 మంది లైబ్రరీయన్, 17 మంది స్వీపర్లు ఉండాలి. కానీ, ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులు, ఇద్దరు ఔట్‌సోర్సింగ్, ఐదు మంది పార్టుటైం ఉద్యోగులు, 13 మంది స్వీపర్లు పనిచేస్తున్నారు. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులైన పరమేశ్వరి లింగాల, ఉప్పునుంతల, బల్మూరు, నాగర్‌కర్నూల్, జిలానీబేగం కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, వెంకటస్వామి కల్వకుర్తి, వెల్దండ, నాగర్‌కర్నూల్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అరుంధతి తెలకపల్లి, అచ్చంపేట లైబ్రరీలో విధులు నిర్వహిస్తూ సందర్భానుసారం వారు మారుతూ ఉంటారు. అయితే ఉన్న ముగ్గురు ఉద్యోగులు కూడా సమయపాలన పాటించడం లేదని, వారికి తోచినప్పుడు వచ్చి రిజిష్టర్‌లో సంతకాలు పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సిబ్బంది లేక వెలవెలబోతున్న
విజ్ఞాన భాండాగారాలు
నాలుగు నెలలుగా జీతాలు రాక స్వీపర్ల అవస్థలు
సిబ్బంది కొరతతో పాఠకులకు తప్పని ఇబ్బందులు
ఏళ్లుగా పట్టించుకోని పాలక
ప్రభుత్వాలు
ప్రతిరోజు గ్రంథాలయాల్లోని కుర్చీలను శుభ్రపరచడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న స్వీపర్లకు నాలుగు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. నెలసరి వేతనాలపై ఆధారపడే స్వీపర్లకు జీతాలు నిలిచిపోవడంతో నిత్యావసరాలు, కుటుంబ ఖర్చులు, పిల్లల చదువుల వంటి అవసరాలను తీర్చుకోవడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనికి వేతనం అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. వచ్చే దసరా పండుగనైనా గుర్తు పెట్టుకొని జీతాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.


