కొనుగోళ్లకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లకు సన్నద్ధం

Oct 5 2026 12:39 AM | Updated on Oct 5 2026 12:39 AM

పారదర్శకంగా చేపడుతాం..

ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

నాణ్యతా ప్రమాణాలకు

అనుగుణంగా..

● ఖరీఫ్‌ సీజన్‌లో 1.25 లక్షల

ఎకరాల్లో వరి సాగు

● 3.16 లక్షల మె.ట., దిగుబడి రానున్నట్లు అంచనా

● 1.20 లక్షల మె.ట.,

ధాన్యం సేకరణ లక్ష్యం

● గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు

అచ్చంపేట: జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వానాకాలం సీజన్‌ ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లాలో ఏటేటా వరిసాగు విస్తీర్ణం పెరుగుతుండగా.. పంటల దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. మరో నెలరోజుల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో 3.16 లక్షల మె.ట., టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా.. ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మా ఆధ్వర్యంలో 183 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం వచ్చినా.. రాకపోయినా ఈ నెల మొదటి వారంలోనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం 1.14 లక్షల మె.ట., ధాన్యం కొనుగోలు చేయగా.. ఈసారి 1.20 లక్షల మె.ట., ధాన్యం వస్తోందని అంచనా వేశారు. వంద ఎకరాల కంటే ఎక్కువ వరి సాగైనా గ్రామాల్లో అక్కడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. ఇందుకు అవసరమైన తూకాలు, గోతాలు, తేమ నిర్ధారణ యంత్రాలు, టార్పాలిన్లు, వరి జల్లెడ పట్టే పరికరాలు ఇలా అన్నింటినీ అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీటి సౌకర్యం, తాత్కాలికంగా మౌళిక వసతులు కల్పించాల్సి ఉంది.

ఇప్పటికే కలెక్టర్‌ సమీక్ష..

జిల్లాలో ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో 1,25,172 ఎకరాల్లో వరి సాగుచేశారు. ఇందులో సుమారు 88 శాతం సన్నరకం కాగా.. 12 శాతం దొడ్డు రకం సాగైంది. ప్రభుత్వం గ్రేడ్‌–ఏ రకం ధాన్యం క్వింటాకు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర ప్రకటించింది. అయితే సన్న రకం ధాన్యానికి అదనంగా రూ.500 బోనన్‌ చెల్లిస్తుండటంతో ప్రైవేట్‌ వ్యాపారుల ధాన్యం కేంద్రాలకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సన్నరకం ధాన్యంలో దొడ్డు రకం కలవకుండా జాగ్రత్తలు తీసుకొనేలా ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి.. 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేయాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ గత నెల 29న జరిగిన సమీక్షలో వెల్లడించారు. అలాగే ట్యాగ్‌ చేసిన మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వరిధాన్యం జిల్లాకు రాకుండా పోలీస్‌, రవాణా శాఖ అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వం సూచించిన సన్నాలకు అందించే బోనస్‌ రూ.500

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా 183 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు కసరత్తు ప్రారంభిస్తున్నాం. పంట చేతికొచ్చే నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి.. కొనుగోళ్లు ప్రక్రియ పారదర్శకంగా చేపడుతాం. – యశ్వంత్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి

●

గత వానాకాలం, యాసంగిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలపై రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎక్కువ శాతం రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకే ధాన్యం అమ్మడంతో కొనుగోలు కేంద్రాల లక్ష్యం నెరవేరలేదు. జిల్లాలో సన్న రకాలకు ఇచ్చే ధర గిట్టుబాటు కాకపోవడంతో ప్రైవేట్‌లోనే ధాన్యం విక్రయించారు. 2 లక్షల మె.ట., ధాన్యం కొనుగోలు సేకరణగా లక్ష్యంగా పెట్టుకొని మొత్తం 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. కేవలం 1.14 లక్షల మె.ట., సేకరించారు. ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది అందుబాటులో లేకపోవడం, తేమ పేరుతో ధరలు తగ్గించడం వంటివి కూడా కారణమయ్యాయి. అలాగే యాసంగిలో 202 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 2 లక్షల మె.ట., ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకోగా.. 1.12 లక్షల మె.ట., మాత్రమే వచ్చింది. ధాన్యంలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే ధరను నిర్ణయిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంకు అకౌంట్‌, ఏఈఓతో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement