కందనూలు: ప్రతి టీకాకు డిజిటల్ నమోదు తప్పనిసరి చేయాలని డీఐఓ సురేష్‌బాబు అన్నారు. గురువారం డిజిటల్ వ్యాక్సినేషన్ సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు యు–విన్ పోర్టల్ వినియోగంపై డీఐఓ కార్యాలయంలో ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారుల నూతన నమోదు, టీకా డోసుల వివరాలు, ఆన్‌లైన్‌లో ఎంట్రీ, డేటా అప్‌డేషన్‌తోపాటు పోర్టల్‌లో ఎదురయ్యే సాంకేతిక సమస్యలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రతి చిన్నారి, గర్భిణికి సంబంధించిన వ్యాక్సినేషన్ వివరాలను 100 శాతం యు–విన్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, ఏపీఓ రాజేశ్వర్, యు–విన్ కోఆర్డినేటర్ బాలకృష్ణ, వీసీసీఎం దివ్య, హెచ్‌ఈఓ శ్రీనివాసులు, ఫసియొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
131.279 మి.యూ., విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగంగా కొనసాగుతోందని ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. గురువారం ఎగువన 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 73.297 మి.యూ., దిగువన 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 57.982 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటి వరకు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో 131.279 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తికి 40 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి వదులుతున్నామన్నారు.
23న కబడ్డీ జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: సూర్యాపేట జిల్లా కోదాడలో ఈనెల 11 నుంచి 13 వరకు జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనే జిల్లా సీనియర్ మహిళా జట్టు ఎంపికను ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు బి.శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారిణులు ఆధార్‌కార్డుతో ఉదయం 9 గంటలకు మెయిన్ స్టేడియంలో రిపోర్టు చేయాలని వారు కోరారు.
2 ఎరువుల దుకాణాల లైసెన్సులు రద్దు
ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని రెండు ఎరువుల దుకాణాల లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేస్తూ వనపర్తి డివిజన్ సహాయక వ్యవసాయ సంచాలకుడు ప్రభాకర్‌రెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి మల్లయ్య తెలిపారు. మండల కేంద్రంలోని స్రవంతి ఫర్టిలైజర్స్, పవన్ ట్రేడర్స్‌లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని కొందరు రైతులు ఈ నెల 7న ఫిర్యాదు చేశారు. స్పందించిన మండల వ్యవసాయ అధికారి ఆయా దుకాణాల్లో రైతుల సమక్షంలో విచారణ చేసి నివేదికను జిల్లా అధికారులకు అందజేశారు. అధిక ధరలు వసూలు చేయడం నేరమని గుర్తించిన ఏడీఏ ప్రభాకర్ రెండు దుకాణాల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు ఆయా దుకాణాల్లో ఎలాంటి ఎరువుల విక్రయాలు జరపరాదని ఆదేశించారు. రైతుల ఫిర్యాదుతో జప్తు చేసిన ఎరువులకు సంబంధించి కోర్టులో 6ఏ కేసు నమోదు చేశామని చెప్పారు.


