నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి వారి జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర వేడుకల అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ మల్లురవి, కలెక్టరు హేమంత కేశవ్ పాటిల్, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణతో కలిసి రేషన్ స్మార్ట్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ కార్డులతో పేదలకు మరింత భరోసా లభిస్తుందన్నారు. జిల్లాలో 2,77,457 పేద కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. పేదలకు నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురావడంతో ఆ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు కేవలం రేషన్ సరుకులు పొందడమే కాకుండా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు విద్య, వైద్యం, ఆరోగ్య సేవలు తదితర ప్రయోజనాలు పొందేందుకు ప్రధాన ఆధారంగా ఉంటుందన్నారు.


