కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రూ. 130కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ఆయన సీఎంను మర్యాద పూర్వకంగా కలిసి.. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం పలు అభివృద్ధికి ప్రతిపాదనలు అందజేశారు. కల్వకుర్తి, ఆమనగల్ మున్సిపాలిటీల్లో సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణాలకు రూ. 80కోట్లు, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు రూ. 50కోట్లు కేటాయించాలని కోరారు. అదే విధంగా నియోజకవర్గానికి అదనంగా 2వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నిధుల మంజూరుపై సీఎం సానుకూలంగా స్పందించి.. అవసరమై న సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.
రౌడీ షీటర్లపై
నిరంతర నిఘా : ఎస్పీ
అచ్చంపేట రూరల్: స్థానికంగా ఉండే రౌడీ షీటర్లపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ ఆదేశించారు. బుధవారం అచ్చంపేట డీఎస్పీ కార్యాలయం, సిద్ధాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సబ్ డివిజనల్ ఆఫీస్, సిద్ధాపూర్ పోలీస్‌స్టేషన్ రిసెప్షన్, రైటర్, ఇతర సిబ్బంది పనితీరుపై ఆరా తీయడంతో పాటు పెండింగ్ కేసుల వివరాలను తెలుసుకున్నారు. స్థానిక రౌడీ షీటర్ల వివరాలను తెలుసుకొని.. వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. వివిధ సమస్యలపై స్టేషన్‌కు ఇచ్చే ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి.. పారదర్శక విచారణ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, అమ్రాబాద్ సీఐ చంద్రయ్య, ఎస్‌ఐలు రమేశ్, నరేశ్, అంజయ్య, మహేశ్ ఉన్నారు.
నేటినుంచి వాలీబాల్
అకాడమీ పునఃప్రారంభం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా వాలీబాల్ అకాడమీని ఈనెల 13 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులందరూ యథావిధిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. కోచ్‌లు, వార్డెన్‌తో పాటు సిబ్బంది అందరూ విధుల్లో చేరాలని సూచించారు.


