అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) విషయంలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల ప్రజలు వెనుకంజలో ఉన్నారు. సర్ ప్రక్రియ ముగియడానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండగా.. జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో కలిపి వేల సంఖ్యలో ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్‌ఓలకు తిరిగి చేరకపోవడం గమనార్హం. ఆశించిన దానికంటే తక్కువ మ్యాపింగ్ నమోదువుతుండటంపై ఇటు ఎన్నికల అధికారుల్లోనే కాకుండా.. అటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లోనూ అలజడి మొదలైంది. ఫలితంగా మెజార్టీ ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రయాదం ఉంది. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యంపై ప్రభావం చూపనుంది. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల మ్యాపింగ్‌పై దృష్టిపెట్టాల్సిందిగా ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్లకు రాష్ట్ర, జిల్లా ఎన్నికల కమిషన్ పదేపదే చెబుతోంది. ఈ మేరకు వారికి శిక్షణ సైతం ఇచ్చింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ పార్టీ ఓటు బ్యాంకుకు అనుకున్న ప్రతి ఒక్క ఓటును డిజటలైజేషన్ చేస్తోంది. ఓటు వేయడం, ఓట్లు కాపాడుకోవడం వంటి ముఖ్యమైన విషయాల్లో ముందుండే పట్టణవాసులు ఇప్పుడు వెనకంజలో ఉండటంతో బీఎల్‌ఓలకు అధికారులు నోటీసులు ఇచ్చే పరిస్థితి దాపురించింది. ప్రధానంగా 60 శాతం దాటని పోలింగ్ బూత్‌లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇంట్లో ఫారాలు తిరిగి ఇచ్చేవారు లేకపోవడం, మరికొందరు చివరి రోజుల్లో ఇస్తామని వాయిదా వేయడం తదితర కారణాలతో పట్టణ ప్రాంతాల్లో సర్ నెమ్మదించింది. ఎన్నికల సమయాల్లోనూ పట్టణ ఓటర్లు సోమరితనం ప్రదర్శిస్తున్నారు. గ్రామ పంచాయతీ, అసెంబ్లీ, ఎంపీ, ఇతర ఎన్నికల్లో పల్లె ఓటర్లు పోటెత్తితే.. పట్టణ ఓటర్లు చాలామంది ఓటేసేందుకు ముందుకు రావడం లేదు. ఇక్కడ ఉన్న మెజార్టీ ఓటర్లు సొంతూళ్లపై మక్కువ చూపుతుండమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
స్పందన అంతంతే..
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లిన బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) ఎక్కువ శాతం ఫారాలు సేకరించగా.. పట్టణాల్లో మాత్రం స్పందన ఆశించిన స్థాయిలో లేదు. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల వంటి కారణాలతో కొంత మంది ఇవ్వడం లేదు. మరికొందరు రేపు.. మాపు అంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. రెండేసీ ఓట్లు కలిగిన మరి కొంత మంది పుట్టిన ఊరిలో ఓటు హక్కు ఉంచుకోవాలనే ఉద్దేశంతో పట్టణాల్లో ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వడం లేదు. ఫోన్ చేసినా ఓటర్ల నుంచి స్పందన ఉండటం లేదని బీఎల్‌ఓలు వాపోతున్నారు. మాకు అక్కడ ఓటు హక్కు అవసరం లేదనే సమాధానం కూడా ఇవ్వడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లో ఓటు హక్కు కలిగిన చాలామంది ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
ఆగస్టు 3 వరకే గడువు..
ఎస్‌ఐఆర్ కార్యక్రమం ఆగస్టు 3తో ముగియనుంది. ఆలోపే తమ ఓటును కాపాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మున్ముందు ఓటుహక్కు పొందడంలోనూ ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఇప్పటికై నా పట్టణ, గ్రామీణ ప్రాంత ఓటర్లు నిర్లక్ష్యం వీడి అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు.
సర్‌పై పట్టణ ఓటర్ల నిర్లక్ష్యం
మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో ఫారాల పెండింగ్
ఎన్యూమరేషన్ ఇవ్వకపోతే ఓటు కోల్పోయే ప్రమాదం
ఓటరు శాతం తగ్గడంపై అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అలజడి
డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తికి మరో నాలుగు రోజులే గడువు


