సర్‌ డిజిటలైజేషన్‌ పారదర్శకంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ డిజిటలైజేషన్‌ పారదర్శకంగా చేపట్టాలి

Jul 31 2026 1:09 AM | Updated on Jul 31 2026 1:09 AM

కందనూలు: ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. డిజిటలైజేషన్‌ ప్రక్రియను కలెక్టర్‌ గురువారం జిల్లాకేంద్రంలోని 116వ పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరు వివరాలు ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని, ఈ ప్రక్రియ నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల వివరాల నమోదు విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. అలాగే కలెక్టరేట్‌ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్‌ చెన్నయ్యతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటరు ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్ర కీలకం అన్నారు. ఫారం6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. అలాగే ఓటరు వివరాల్లో మార్పులు, సవరణలు, చిరునామా మార్పులు వంటి అంశాలను సంబంధిత దరఖాస్తుల ద్వారా సులభంగా చేసుకోవచ్చన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ అర్చన, మున్సిపల్‌ చైర్మన్‌ సునేంద్ర, కమిషనర్‌ నాగిరెడ్డి, బీఎల్‌ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీసీ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 38 శాతం తక్కువ నమోదైందన్నారు. అయితే రెండు రోజులుగా జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో జిల్లా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీరాజ్‌, వైద్య, విద్యుత్‌, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్‌ చెన్నయ్య, ఏఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement