కందనూలు: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, పరిశోధనా నైపుణ్యాలు, సమస్యలను విశ్లేషించి పరిష్కార మార్గాలను కనుగొనే సామర్థ్యం, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు నిర్వహిస్తున్న జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్‌కు ఆన్‌లైన్‌లో విద్యార్థుల పేర్లు నమోదు చేయాలని డీఈఓ రమేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ ఏడాది జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్‌కు ‘స్థిరత్వం కోసం విజ్ఞానం ఆవిష్కరణ’ అనే ప్రధాన అంశాన్ని ఎంపిక చేశామన్నారు. ప్రతి పాఠశాల నుంచి కనీసం ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి, ఏసీఎస్‌సీ సూచించిన ఉపాంశాల్లో ఒక అంశాన్ని ఎంచుకొని ప్రాజెక్టు రూపకల్పన చేపట్టాలన్నారు. ప్రతి పాఠశాల నుంచి కనీసం ఒక ప్రాజెక్టును తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులు, ప్రాజెక్టు వివరాలను https://ncrc.in/ వెబ్‌సైట్‌లో వచ్చేనెల 15లోగా నమోదు చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 63025 38858, 91008 76190లను సంప్రదించాలని కోరారు.
నేడు డయల్
యువర్ డీఎం
కల్వకుర్తి టౌన్: కల్వకుర్తి డిపో పరిధిలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం సుభాషిణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని ప్రజలు, ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు ఫోన్ చేయదలచిన వారు సెల్ నం.99592 26292ను సంప్రదించాలని పేర్కొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
కందనూలు: ఉపాధ్యాయుల అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ విజిట్ కోసం జిల్లా నుంచి ఆరు మంది ఉత్తమ ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు, ప్రిన్సిపల్‌లను ఎంపిక చేయనున్నట్లు డీఈఓ రమేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం గురువారం నుంచి వచ్చేనెల 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
నేడు రాష్ట్రస్థాయి గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ గోగేమ్ క్రీడాకారుల ఎంపికలను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జిల్లాకేంద్రంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్, సీనియర్ ఉపాధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తమ ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, జిరాక్స్ కాపీలతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని కోరారు. మిగతా వివరాల కోసం 98857 04173, 98852 42848 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ముమ్మరంగా సర్ ప్రక్రియ
కొల్లాపూర్: మున్సిపాలిటీలో జరుగుతున్న సర్ నమోదును అదనపు కలెక్టర్ చెన్నయ్య గురువారం పరిశీలించారు. పట్టణంలోని 253, 263, 267 బూత్‌లలో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను తనిఖీ చేశారు. స్థానిక బీఎల్‌ఓలతో మాట్లాడి ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ వివరాలు తెలుసుకున్నారు. ప్రతి బూత్‌లో వందశాతం డిజిటలైజేషన్ చేయాలని, సర్ నమోదులో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. మ్యాపింగ్ నిర్వహించే సమయంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వెంటనే వాటిని సరిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ వివరాలపై ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఆయన వెంట ఆర్డీఓ భన్సీలాల్, మున్సిపల్ కమిషనర్ శంకర్ తదితరులున్నారు.


