వ్యాధుల నివారణకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక చర్యలు
కందనూలు: సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. వానాకాలంలో ప్రబలే టైఫాయిడ్, అతిసారం, మలేరియా, డెంగీ, చికున్‌గున్యా తదితర వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. గతేడాది జిల్లాలోని ఏ ప్రాంతంలో ఏ వ్యాధులు ఎక్కువగా నమోదయ్యాయి.. ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిసారించింది. ఇప్పటికే వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. జ్వర పీడితులకు అవసరమైన పరీక్షలు చేయడంతో పాటు వ్యాధుల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు.
పరిశుభ్రత పాటించాలి..
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన చర్యలు చేపట్టాం. ఈ నెల 6 నుంచి ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నాం. వ్యాధుల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇళ్ల చుట్టూ మురుగు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. – డా.కృష్ణ, డీఎంహెచ్‌ఓ
రోజూ 50 ఇళ్ల సర్వే..
జిల్లావ్యాప్తంగా 560 సర్వే బృందాలను ఏర్పాటుచేశారు. ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్ల భాగస్వామ్యంతో ఒక్కో బృందం రోజుకు 50 ఇళ్లను సర్వే చేయాలని నిర్దేశించారు. ఇప్పటికే సర్వే బృందాలు 1,16,140 గృహాల్లో 3,22,999 మంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వీరిలో దాదాపు 606 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించి.. వివరాలను నమోదు చేసుకున్నారు. వారికి అవసరమైన మందులు అందజేస్తూ.. జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటే పీహెచ్‌సీలకు తరలిస్తున్నారు. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఈ ప్రక్రియను హెల్త్ సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తుండగా.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వారీగా వైద్యాధికారులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా ఇలా..
జిల్లాలోని 20 మండలాల్లో 461 గ్రామ పంచాయతీలు ఉండగా.. 27 పీహెచ్‌సీలు, 1 అర్బన్ పీహెచ్‌సీ, 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు జిల్లా జనరల్ ఆస్పత్రి ఉన్నాయి. జిల్లా ఆస్పత్రికి రోజు దాదాపు 2వేల మంది వివిధ ఆరోగ్య సమస్యలతో వస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు బారినపడిన వారు 30 నుంచి 50 మందికి పైగా ఓపీ వస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. జ్వర పీడితుల రక్త నమూనాలను సేకరించి.. జిల్లా కేంద్రంలోని టీ హబ్‌కు పంపిస్తున్నారు. పరీక్ష ఫలితాల ఆధారంగా వ్యాధిని నిర్ధారించి, ప్రతి ఆరోగ్యకేంద్రంలో వైద్యం అందిస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు నిర్ధారణ అయితే వెంటనే డాక్టర్లు అప్రమత్తమై.. వారికి అవసరమైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కొనసాగుతున్న ఇంటింటా ఫీవర్ సర్వే
జిల్లావ్యాప్తంగా 560 బృందాల ఏర్పాటు
ఇప్పటివరకు 1,16,140 గృహాలసర్వే పూర్తి
ఐదేళ్లలో నమోదైన కేసులు ఇలా..


