బిందుసేద్యంపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

బిందుసేద్యంపై దృష్టి సారించాలి

Jul 19 2026 2:02 AM | Updated on Jul 19 2026 2:02 AM

తాడూరు: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు బిందుసేద్యంపై దృష్టిసారించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎం.వెంకటేశం సూచించారు. శనివారం తాడూరు మండలం మేడిపూర్‌, బిజినేపల్లి మండలం లింగసానిపల్లి గ్రామాల్లో రైతులు మల్చింగ్‌ విధానంతో సాగుచేసిన అయిల్‌పామ్‌, కూరగాయల తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం బిందుసేద్యం పరికరాలను 80శాతం వరకు రాయితీలు ఇస్తోందన్నారు. మల్చింగ్‌ విధానంలో ఎకరాకు రూ. 20వేల వరకు సబ్సిడీ అందుతుందని తెలిపారు. రైతులు నీటి సంరక్షణ పద్ధతులు పాటించి.. కూరగాయలు, ఆయిల్‌పామ్‌ తోటలను సంరక్షించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఉద్యానశాఖ డివిజన్‌ అధికారి జగన్‌, విస్తరణాధికారి దేవేందర్‌, యూనిక్‌ అధికారి శివ భార్గవ్‌, కుర్మయ్య ఉన్నారు.

సమష్టి కృషితోనే అభివృద్ధి

కొల్లాపూర్‌: స్థానిక ఆర్టీసీ డిపో అభివృద్ధికి ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఖుష్రో షా ఖాన్‌ సూచించారు. శనివారం కొల్లాపూర్‌ డిపోలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు విభాగాలను పరిశీలించారు. డిపో ఆదాయ, వ్యయాలు, నిర్వహణ అంశాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం డిపో ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్‌ మేనేజర్‌ కృష్ణమూర్తి, డీఎం మల్లేశం పాల్గొన్నారు.

నిబంధనలు

ఉల్లంఘిస్తే చర్యలు

అచ్చంపేట: ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ నోడల్‌ ఆఫీసర్‌ జి.వెంకటరమణ హెచ్చరించారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని న్యూమాస్టర్‌ మైండ్స్‌ జూనియర్‌ కళాశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కళాశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు పుస్తకాలను విక్రయిస్తున్నట్లు గుర్తించి.. పుస్తకాలు నిల్వ ఉంచిన గదిని అధికారికంగా సీజ్‌ చేశారు. ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని.. కళాశాల ప్రాంగణంలో ఎలాంటి పుస్తకాల విక్రయాలు జరపరాదని.. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయరాదని ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఉల్లంఘన పునరావృతమైతే చట్టపరమైన చర్యలు చేపడుతామని ఆయన స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో

ఓటుహక్కు కల్పించాలి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్‌లకు ఓటుహక్కు కల్పించాలని పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సర్పంచ్‌ల సంఘం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వివిధ కమిటీల పేరుతో ఇతరులను అధ్యక్షులుగా నియమించడం తగదన్నారు. జాయింట్‌ చెక్‌పవర్‌ను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన ఎన్‌ఆర్‌జీసీ నిధులను ఆయా గ్రామాలకే కేటాయించాలన్నారు. సర్పంచ్‌ల గౌరవ వేతనం రూ.25 వేలకు పెంచాలని, కలెక్టర్‌ వెంటనే గ్రీన్‌ చానల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే విజన్‌–2047, వికసిత్‌ భారత్‌ వంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయన్నారు. కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా సర్పంచ్‌ల ఫోరం కన్వీనర్‌ రాజశేఖర్‌, వనపర్తి జిల్లా కన్వీనర్‌ శేఖర్‌గౌడ్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా నాయకురాలు వీరోజు సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement