కల్వకుర్తి: రాష్ట్ర ప్రభుత్వం కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని.. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం జెడ్పీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామాభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణాలు, రహదారులు, పారిశుద్ధ్యం, పచ్చదనం వంటి అనేక రంగాల్లో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామస్తులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఏదైనా సాంకేతిక, పరిపాలనా లేదా ఇతర సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో గోపాల్‌నాయక్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం..
కందనూలు: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి సరఫరాను నిరంతరాయంగా కొనసాగించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని.. ఎంజీకేఎల్‌ఐ పరిధిలోని ఆయకట్టుకు ప్రస్తుతం సాగునీటిని విడుదల చేయడం సాధ్యం కాదని కలెక్టర్ స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంజీకేఎల్ ద్వారా సుమారు 4.51 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల నీటిని వినియోగించేలా ప్రణాళిక రూపొందించబడిందని తెలిపారు. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీశైలం జలాశయానికి గణనీయమైన వరద ప్రవాహాలు రాకపోవడంతో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవన్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో స్థూల నీటినిల్వ 41.45 టీఎంసీలు ఉన్నప్పటికీ.. అందులో 30 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ అని, వాస్తవంగా వినియోగించదగిన జీవ జల నిల్వ కేవలం 11.45 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. ఇదిలా ఉంటే, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా కోసం ప్రతి సంవత్సరం 7.12 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగిందని.. ఇప్పటికే జూన్ 1 నుంచి జూలై 18 వరకు 1.363 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని ఎల్లూరు, గుడిపల్లిగట్టు, జొన్నలబొగుడ, సింగోటం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో కేవలం 2.23 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉందని.. ఈ పరిస్థితుల్లో సాగునీటిని విడుదలచేస్తే భవిష్యత్‌లో తాగునీటి అవసరాలు కూడా సంక్షోభంలో పడే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రైతాంగం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిసారించాలని ఆయన సూచించారు.


