కందనూలు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్రశాఖ పిలుపుమేరకు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 6 డీఏలు మంజూరు చేసి బకాయిలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులు వెంటనే చెల్లించాలని, కేజీబీవీ, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, 2003 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, పదో తరగతి ఇన్విజిలేషన్ పారితోషికాన్ని 40 శాతం పెంచాలని, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌లో 40 శాతం కటాఫ్ మార్కులు అర్హతగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి శేఖర్, నాయకులు నాగరాజు, రాజశేఖర్‌రావు, సురేష్, మల్లేష్, సురేఖరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


