పేద విద్యార్థులకు ఇబ్బంది..
●
యూనిఫాంలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. వస్త్రం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. వస్త్రం వచ్చిన వెంటనే కొలతలు తీసుకొని కుట్టడానికి ఇస్తాం. ఆ తర్వాత విద్యార్థులకు అందజేస్తాం. – రమేష్‌కుమార్, డీఈఓ
మా పాఠశాలలో యూనిఫాంలు ఇవ్వకపోవడంతో సివిల్ డ్రెస్‌తోనే వస్తున్నా. పై నుంచి ఇంకా డ్రెస్సులు రాలేదని చె బుతున్నారు. కొంతమంది విద్యార్థులు పాత యూనిఫాంలతో, మరికొంత మంది సివిల్ డ్రెస్‌లో వస్తున్నారు.
– యుగేంధర్, 10వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నాగర్‌కర్నూల్
గతేడాది ఇచ్చిన యూనిఫాం చిరిగిపోయింది. ఈ ఏడాదికి సంబంధించిన డ్రెస్సులు ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారని సారోళ్లను అడిగితే మాకు తెలియదు అని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి యూనిఫాంలు త్వరగా ఇస్తే బాగుంటుంది.
– రమేష్, 7వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నాగర్‌కర్నూల్
కందనూలు: పాఠశాలల పునఃప్రారంభమైన మొదటి రోజు నుంచే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతోపాటు యూనిఫాంలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు ఏమాత్రం ఫలించలేకపోయాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇప్పటి వరకు నెల రోజులు గడిచినా విద్యార్థులకు యూనిఫాంలు అందలేదు. ప్రతిఏటా మాదిరిగానే ఈసారి కూడా దుస్తులు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకు సంఘాలకు వస్త్రమే చేరలేదు. దీంతో జిల్లాలోని చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాత యూనిఫాంలు, సివిల్ దుస్తులతోనే హాజరవుతున్నారు.
డిజైన్‌లో మార్పులు..
ఈ విద్యా సంవత్సరం నుంచి యూనిఫాంల రంగు, డిజైన్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. బాలికలకు లాంగ్ ఫ్రాక్, షర్ట్, స్కర్ట్, బాలురకు నీలం రంగు చొక్కా, లేత నీలం రంగు నిక్కర్ లేదా ప్యాంటు తరగతుల వారిగా అందించనుంది. కొత్త డిజైన్ ఖరారైన క్లాత్ సరఫరా లేకపోవడంతో అవి విద్యార్థులకు ఎప్పుడు అందుతాయనే దానిపై స్పష్టత లేకుండాపోయింది.
ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువ శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు మాత్రమే వస్తుంటారు. అలాంటి సమయంలో విద్యార్థులకు సరైన సివిల్ డ్రెస్సులు లేక పలువురు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలు తెరిచిన రోజునే రావాల్సిన యూనిఫాం ఇప్పటి వరకు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. యూనిఫాంల విషయంలో అధికారులు సైతం అలసత్వం ప్రదర్శించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా త్వరగా యూనిఫాంలు సరఫరా చేయా లని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇప్పటికీ జిల్లాకు చేరని వస్త్రం.. డ్రెస్సులు కుట్టేదెప్పుడో?
కొత్త దుస్తుల పంపిణీపై చలనం లేని యంత్రాంగం
పాత దుస్తులతోనే సరిపెట్టుకుంటున్న విద్యార్థులు
మరో రెండు నెలల వరకు ఇదే పరిస్థితి


