గజిబిజి.. గందరగోళం
మున్సిపల్ ఓటరు జాబితాపై పెద్దఎత్తున అభ్యంతరాలు
● పలుచోట్ల ఇష్టారీతిగా
వార్డులు, ఓటర్ల విభజన
● కల్వకుర్తిలో ఒకే ఇంటి నంబర్‌లో 15 మందిని చేర్చిన వైనం
● క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే రూపొందించారని ఆక్షేపణ
● నేటితో ముగియనున్న అభ్యంతరాల స్వీకరణ గడువు
వాళ్లు ఎవరో తెలియదు..
మా ఇంటి నంబర్‌పై మొత్తం 15 మంది ఓటర్లు ఉన్నారు. కానీ, మా ఇంట్లో నలుగురమే ఉన్నాం. మిగతా వాళ్లు ఎవరో కూడా మాకు తెలియదు. మాకు సంబంధం లేకుండా ఇతరుల ఓట్లను ఎలా నమోదు చేస్తారు. దీనిపై అధికారుల నుంచి సమాధానం లేదు. జాబితాను సవరించి ఎన్నికలు నిర్వహించాలి.
– రాజుగౌడ్, కల్వకుర్తి
నేటి వరకు అవకాశం..
మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా సవరణ, అభ్యంతరాలకు శుక్రవారం వరకు గడువు ఉంది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి వాటిలో అర్హమైన వాటిని తప్పకుండా సవరిస్తాం. ఇంటి నంబర్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత జాబితా రూపొందిస్తాం.
– నాగిరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, నాగర్‌కర్నూల్
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో మున్సిపాలిటీ ఓటర్ల జాబితాలో చేర్పులు, వార్డుల విభజనలో గందరగోళం నెలకొంది. ఓటర్ల నమోదుతోపాటు వార్డుల కేటాయింపులో పెద్దఎత్తున తప్పులు దొర్లడంతో మున్సిపాలిటీ కార్యాలయాలకు అభ్యంతరాల వెల్లువ కొనసాగుతోంది. అయితే శుక్రవారం వరకు మున్సిపాలిటీ ఓటర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని సంబంధిత అధికారులు చెబుతుండగా.. జాబితా సవరణపై పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే..
మున్సిపాలిటీ ఓటరు జాబితా సిద్ధం చేయడంతోపాటు వార్డుల వారీగా ఓటర్ల విభజన విషయంలో అధికారులు క్షేత్రస్థాయిలో కసరత్తు చేపట్టాల్సి ఉండగా.. ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకే ఇంటి నంబర్‌లో పదుల సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేయడం, వార్డులకు సంబంధం లేకుండా ఇతర గ్రామాలు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఓటర్లుగా నమోదుకావడం చర్చకు దారితీస్తోంది. బీఎల్‌ఓ ద్వారా వార్డులోని ప్రతి ఇంటిలో క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత ఓటరు నమోదు చేపట్టాల్సి ఉండగా.. పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడంతో జాబితాలో పెద్దఎత్తున తప్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇంటి యజమానులు, బీఎల్‌ఓలకు సైతం తెలియకుండానే ఓటర్లుగా నమోదు కావడం గమనార్హం.
గజిబిజి.. గందరగోళం


