పకడ్బందీగా ‘ఆపరేషన్ స్మైల్’ తనిఖీలు
నాగర్‌కర్నూల్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో 12వ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మికులు లేకుండా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. ఇందుకోసం కార్మిక, పోలీస్, విద్య, మహిళాశిశు సంక్షేమ శాఖలు సమష్టిగా పనిచేయాలన్నారు. పరిశ్రమలు, హోటళ్లు, లాడ్జీలు, వ్యాపార సముదాయాలు, గోదాంలు, ఇటుక బట్టీలు, మెకానిక్, వర్క్‌షాపులు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. తనిఖీల సమయంలో గుర్తించిన బాల కార్మికులకు పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు, వీధుల్లో తిరుగుతున్న పిల్లలు కనిపిస్తే డయల్ 100 లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని హెచ్చరించారు. గతేడాది 33 కేసులు నమోదు కాగా 28 ఎఫ్‌ఐఆర్ చేశామని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శ్రీశైలం కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సఖి కేంద్రం కేసుల వివరాలపై కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీడబ్ల్యూఓ రాజేశ్వరి, లేబర్ అధికారి రాజ్‌కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఉమాపతి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ చైర్మన్ లక్ష్మణ్‌రావు, సఖి కేంద్రం కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు.


