
పంద్రాగస్టు వేడుకలకు అన్ని ఏర్పాట్లు
నాగర్‌కర్నూల్: పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య అతిథి ప్రసంగం కోసం ఆయా శాఖల ప్రగతి నివేదికలను జిల్లా ప్రణాళిక అధికారికి పంపించాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, జిల్లా గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖల ప్రగతిని ప్రతిబింబించే స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. డీఈఓ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఉత్తమ ఉద్యోగుల వివరాలను కలెక్టరేట్‌కు పంపించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి.. వేడుకలను విజయవంతం చేయాలన్నారు.
పిల్లల్లో నులిపురుగులను నిర్మూలిద్దాం
జిల్లాలో ఈ నెల 11న నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1నుంచి 19ఏళ్లలోపు వయసు గల వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. జిల్లాలోని 1,191 అంగన్‌వాడీ కేంద్రాలు, 1,147 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 2,03,259 మందికి ఆల్బెండజోల్ 400 ఎంజీ మాత్రలు వేయాలన్నారు. 11నుంచి 18వ తేదీ వరకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్, డీఈఓ రమేశ్‌కుమార్, జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి తదితరులు ఉన్నారు.
ఎరువుల వివరాలు పక్కాగా ఉండాలి..
కల్వకుర్తి టౌన్/కల్వకుర్తి రూరల్: రైతులకు విక్రయించే ప్రతి ఎరువుకు సంబంధించిన వివరాలు పక్కాగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. కల్వకుర్తిలోని పీఏసీఎస్ గోదాములో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పీఏసీఎస్‌కు 405 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయగా.. 395 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందజేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అయితే రైతులకు అధిక మొత్తంలో యూరియాను అందించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రికార్డుల నిర్వహణ సైతం సక్రమంగా లేకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. రైతులు సాగుచేసే పంటల ఆధారంగా యూరియా అందించాలని ఆదేశించినా ఎందుకు పాటించటం లేదని అధికారులను ప్రశ్నించారు. ఎరువుల దుకాణాల్లో యూరియా స్టాక్ వివరాలను బోర్డులపై ఉంచాలని సూచించారు. కలెక్టర్ వెంట పీఏసీఎస్ సీఈఓ వెంకట్‌రెడ్డి ఉన్నారు.
● కల్వకుర్తి బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ముందుగా పాఠశాలలో స్టోర్‌రూం, కిచెన్, డైనింగ్ హాల్, బాత్‌రూంలు, లైబ్రరీలను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహఫంక్తి భోజనం చేశారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యతగా మధ్యాహ్న భోజనం అందించాలని.. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
అన్ని శాఖల ప్రగతి నివేదికలను
ప్రణాళిక అధికారికి పంపించాలి
అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి