
ఉత్సాహంగా విలువిద్య పోటీలు
మన్ననూర్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం చెంచు ఐక్యవేదిక, అటవీ హక్కుల సాధన కమిటీ, పీసా గ్రామసభల సాధారణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మన్ననూర్ పీటీజీ పాఠశాల ఆవరణలో విలువిద్య పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అమ్రాబాద్, పదర, లింగాల, అచ్చంపేట మండలాలకు చెందిన 50 మంది చెంచు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిమ్మల చిన్నబయ్యన్న (మొల్కమామిడి), తోకల గురువయ్య (మేడిమల్కల), మెండ్లి పెద్ద లింగయ్య (బీకే ఉప్పునుంతల) అత్యుత్తమ ప్రతిభకనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఈ సందర్భంగా చెంచు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చిగుర్ల మల్లికార్జున్ మాట్లాడుతూ.. నైపుణ్యం వెలికితీసేందుకు పోటీలు దోహదం చేస్తాయన్నారు. విలువిద్యలో చెంచు యువకులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెంచుల ప్రావీణ్యత, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సాహం అందించాలని కోరారు.