
కాల్వల నిర్వహణ గాలికి..
●
● ప్రతి ఏటా తెగుతున్న కేఎల్‌ఐ కాల్వలు
● పంటపొలాలు నీటమునిగి
నష్టపోతున్న రైతులు
● కాల్వలకు లైనింగ్ నిర్మించాలని వేడుకోలు
రెండెకరాల్లో పంటనష్టం..
గతేడాది నాలుగు ఎకరాల్లో పత్తిపంట సాగుచేశా. కేఎల్‌ఐ కాల్వ తెగిపోవడంతో నీరంతా పత్తి పంటలోకి చేరుకుని పత్తికాయ మొత్తం మునిగిపోయింది. పంట మొత్తం ఎర్రబారిపోయింది. రెండెకరాల్లో పంటనష్టం వాటిల్లింది. రూ.లక్షకు పైగా నష్టపోయాను. అధికారులు వివరాలు తీసుకెళ్లారు కానీ.. నష్టపరిహారం చెల్లించలేదు.
– శ్రీశైలం,
గుంతకోడూరు, తాడూరు మండలం
ప్రతిపాదనలు పంిపించాం..
కేఎల్‌ఐ కాల్వల లైనింగ్ పనులకు సంబంధించి ప్రత్యేకంగా నిధులు ఏమీ మంజూరుకాలేదు. ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పూర్తయ్యాకే లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే ప్రతిపాదనలు పంపించడం జరిగింది. – విజయభాస్కర్,
ఎస్‌ఈ, జలవనరులశాఖ
నాగర్‌కర్నూల్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు రూ.వేలకోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. వాటి నాణ్యత, నిర్వహణపై శీతకన్ను వేస్తోంది. ఫలితంగా కాల్వల భద్రత గాల్లో దీపంలా మారింది. ఏమాత్రం నీటి ఒత్తిడి అధికమైనా కాల్వలకు గండ్లు పడి పంట పొలాలు మునిగిపోయే దుస్థిఽతి నెలకొంది. ఏటా వేసవిలో ప్రాజెక్టుల కాల్వలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటి మరమ్మతుకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయకపోవడంతో నిర్వహణ కొరవడటంతో అధ్వానంగా మారాయి. దీంతో సాగునీరు వచ్చే సమయంలో సంతోషపడాల్సిన రైతుల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇందుకు కాల్వలకు లైనింగ్ లేకపోవడం, నాసిరకం పనులే కారణమని రైతులు పేర్కొంటున్నారు.
మచ్చుకు కొన్ని ఘటనలు..
● గతేడాది తాడూరు మండలం తుమ్మల సుగూరు వద్ద కేఎల్‌ఐ కాల్వ తెగిపోవడంతో దాదాపు 100 ఎకరాల వరకు పంటలు నీటమునిగాయి. అంతేకాకుండా నీటి తాకిడికి తుమ్మలసుగూరు కుంటకట్ట కూడా తెగిపోయింది.
● కోడేరు మండలం ఎత్తం శివారులో ఉన్న కేఎల్‌ఐ కాల్వకు గండి పడటంతో దాదాపు 30 ఎకరాల్లో పంట నీటమునిగింది. కాల్వకు ఒక మోటారు ద్వారా నీరు వస్తేనే తెగిపోతుందని.. మరిన్ని మోటార్లు అందుబాటులోకి వస్తే కాల్వ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
● వట్టెం శివారులోని కేఎల్‌ఐ ప్రధాన కాల్వకు గండి పడటంతో దాదాపు 40 ఎకరాల పత్తిపంట నీటమునిగింది.
● తిమ్మాజిపేట మండలం మారేపల్లిలో కాల్వ కట్ట తెగిపోవడంతో 70 ఎకరాల్లో పత్తిపంటను రైతులు నష్టపోయారు.
● తాడూరు మండలం చర్ల ఇటిక్యాల వద్ద కాల్వ కట్టకు గండి పడి దాదాపు 60 ఎకరాల పంట నీటమునిగింది. ఇదే మండలంలోని బలాన్‌పల్లి, కొమ్ముగుట్ట వద్ద కూడా కాల్వలు తెగిపోయాయి.
● ఊర్కొండ మండలం గుడిగానిపల్లి, కల్వకుర్తి మండలం కుర్మిద్ద వద్ద ప్రధాన కాల్వ తెగిపోవడంతో 20 ఎకరాల పంట నీటమునిగింది.

కాల్వల నిర్వహణ గాలికి..