
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి
కందనూలు: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో జిల్లా అధ్యక్షుడు మురళి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. పదోన్నతులతో పాటు బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కోరారు. 317 జీఓ బాధితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలన్నారు. హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతినెలా క్రమం తప్పకుండా విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రావు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు, జిల్లా మాజీ అధ్యక్షుడు సుదర్శన్ ఉన్నారు.