కందనూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఉల్లాస్‌పై జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాస్థాయి వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 11వ తేదీలోగా వీఓఏలు అన్ని గ్రామాల్లో నిరక్షరాస్యులను గుర్తించి ఉల్లాస్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. మండల రిసోర్స్‌పర్సన్లు అక్షర వికాసం పుస్తకంపై వలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. మధ్యలోనే బడి మానివేసిన విద్యార్థులు టాస్క్ ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్‌ఎస్‌సీ పూర్తి చేయించాలని ఉపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అకాడమిక్ మానిటరింగ్ అధికారి కిరణ్‌కుమార్, ఎంఈఓ భాస్కర్‌రెడ్డి, రిసోర్స్‌పర్సన్స్ లక్ష్మీనరసింహారావు, శోభన్ బాబు, రాజేందర్ పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు టెండర్లు
చిన్నచింతకుంట: ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహోత్సవాలను పురస్కరించుకొని వివిధ రకాల వ్యాపారాలు చేపట్టేందుకు ఈ నెల 20న ఆలయం వద్ద బహిరంగ టెండర్లు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా కొబ్బరికాయలు, లడ్డు, పులిహోర ప్రసాదాలు, పూజ సామగ్రి విక్రయాలు, తలనీలాలు, కొబ్బరి చిప్పలు సేకరించడానికి, లైటింగ్ వసతి, రంగుల రాట్నాలు ఏర్పాటు చేసుకోవడానికి వేలం పాటలు నిర్వహిస్తామన్నారు. వేలం పాటలో పాల్గొనేందుకు ఆసక్తి గలవారు కొబ్బరికాయలకు రూ.5 లక్షలు, లడ్డు, పులిహోర రూ.5 లక్షలు, తలనీలాల సేకరణకు రూ.5 లక్షలు, పూజా సామగ్రికి రూ.2 లక్షలు, టెంకాయ చిప్పలు రూ.2 లక్షలు, లైటింగ్ వసతికి రూ.2 లక్షలు, రంగుల రాట్నంకు రూ.2 లక్షలు డిపాటిట్ చేయాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు కురుమూర్తి స్వామి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
రామన్‌పాడులో
పూర్తిస్థాయి నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో గురువారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,080 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 725 క్యూసెక్కుల వరద జలాశయానికి కొనసాగుతోంది. రామన్‌పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 65 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.