
నదిలో రోడ్డేసి.. దర్జాగా తవ్వేసి..
●
కృష్ణా పరివాహకంలో
యథేచ్ఛగా ఇసుక దందా
● నారాయణపేట జిల్లాలో పేట్రేగుతున్న ఇసుక మాఫియా
● జేసీబీ, హిటాచీల వంటి భారీ యంత్రాలతో తవ్వకాలు
● 2 చోట్ల రోడ్డు వేసి పగలు, రాత్రనక బెంజ్ వాహనాల్లో రవాణా
● పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
● ఫిర్యాదులు వచ్చినప్పుడే తనిఖీల పర్వం
● తూతూమంత్రపు కేసులతో సరిపెడుతున్న ఖాకీలు
● ఓ రాజకీయ నేత ‘హస్తం’ ఉన్నట్లు ఆరోపణలు
అధికారులు పట్టించుకోవాలి..
కృష్ణా నది నుంచి ఇసుక తరలించడం మూలంగా సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతోపాటు నదిలో రోడ్లు వేయడం వల్ల దిగువకు నీళ్లు రాకుండా పోతున్నాయి. ఉన్న కాస్త నీరు అక్కడే నిలుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే వేసవి చివరలో నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అధికారులు పట్టించుకోవాలి.
– అంబ్రెష్. మాజీ సర్పంచ్,
గుడెబల్లూరు, కృష్ణా
నా దృష్టికి రాలేదు..
నది రోడ్లు వేసినట్లు నా దృష్టికి రాలేదు. త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టినా.. అనుమతుల్లేకుండా తరలిస్తున్నా.. చర్యలు తప్పవు.
– వెంకటేష్. తహసీల్దార్, కృష్ణా
ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా..
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో మైనింగ్ సిబ్బంది కొరత ఉంది. అయినా నదిలో రోడ్డు వేసినట్లు మా దృష్టికి వచ్చిన వెంటనే.. పరిశీలించాలని సిబ్బందిని పంపించా. నీటిని మళ్లించేందుకు రైతులు వేసుకున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా. చర్యలు తీసుకోవాల్సింది వారు. – సంజయ్,
ఏడీ, మైనింగ్ శాఖ, మహబూబ్‌నగర్
తొలుత 8 కి.మీ.ల మేర మట్టి రోడ్డు..
ఉమ్మడి పాలమూరు.. ప్రస్తుత నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో తంగిడి వద్ద కృష్ణానది ప్రవేశిస్తోంది. ఈ మండల పరిధి టైరోడ్ సమీపంలో కృష్ణా పరివాహకంలోని ఓ ఆశ్రమం వద్ద మాఫియా ఆధ్వర్యంలో నదిలో తొలుత ఏడెనిమిది కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు నిర్మించింది. నదిలో ఊట నీరు లేదంటే వరద వచ్చినా.. ఇబ్బందుల్లేకుండా అక్కడక్కడ చిన్న చిన్న తూములను ఏర్పాటు చేసి మట్టి రోడ్డు వేశారు. ప్రస్తుతం నదిలో ఇసుక మేటలు పెద్ద ఎత్తున తేలగా.. ఆ ప్రాంతంలో హిటాచీ, జేసీబీల వంటి భారీ యంత్రాలతో తవ్వి.. ఈ మట్టి రోడ్డు గుండా బెంజ్‌లు, టిప్పర్ల ద్వారా పగలు, రాత్రనక కర్ణాటకకు తరలిస్తున్నారు.
ఆ తర్వాత వేరే చోట..
తొలుత మట్టి రోడ్డు వేసి బెంజ్ వంటి వాహనాల్లో ఇసుక తరలించడంపై పలువురు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇసుక తరలిస్తున్న వాహనాలపై పోలీసులు తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఎవరు కూడా అటు వైపు చూడకపోవడంతో ఇసుక మాఫియా రాత్రిళ్లూ యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో అదే ఆశ్రమం నుంచి కొద్దిదూరంలో వేరే చోట మట్టి రోడ్డు వేసి.. భారీ ఎత్తున తవ్వకాలు చేపడుతోంది. రోజుకు వందలాది ట్రిప్పుల చొప్పున ఇసుకను కర్ణాటకలోని తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటోంది. బెంజ్ ఇసుకను రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
దందా వెనుక ఎవరి ‘హస్తమో’?
కృష్ణా పరివాహకంలో అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా నదిలో రోడ్డు వేసినా.. రాత్రిళ్లూ ఇసుక రవాణా కొనసాగుతున్నా.. రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఇరిగేషన్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా వెనుక నారాయణపేట జిల్లాకు చెందిన ఓ ‘అధికార’ నేత హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణా మండలానికి చెందిన ఓ నాయకుడు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.
సమన్వయ లేమినా.. ముడుపులు అందడంతోనా..
ఇసుక దందాను అరికట్టడంలో భాగంగా ప్రభు త్వ ఆదేశాల మేరకు పేట జిల్లా అధికార యంత్రాంగం ఇదివరకే టాస్క్‌ఫోర్స్ కమిటీ వేసింది. ఇందులో రెవెన్యూ, భూగర్భ జల, ఇరిగేషన్, పోలీస్, ఆర్టీఏ అధికారులు ఉన్నారు. వీరందరూ ఐక్య కార్యాచరణతో ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టాల్సి ఉంది. కానీ.. జిల్లాలో ఆయా శాఖల మధ్య సమన్వయం కొరవడినట్లు తెలుస్తోంది. మరో వైపు ఆయా శాఖల అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. నెలనెలా శాఖల వారీగా ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా నదిలో రోడ్డు వేస్తే చర్యలు తీసుకోరా.. రాత్రిళ్లూ తవ్వకాలు చేప ట్టొచ్చా? అని ‘సాక్షి’ వివిధ విభాగాల అధికారులను సంప్రదించగా..మా బాధ్యత కాదు అంటూ ముక్తసరిగా సమాధానం ఇవ్వడం గమనార్హం.
మళ్లీ కొన్ని రోజుల తర్వాత మఠం నుంచి దాదాపు రెండు కి.మీ.ల దూరంలో ఏడెనిమిది కిలోమీటర్ల మేర నదిలో వేసిన మరో రోడ్డు ఇది..
మక్తల్ నియోజకవర్గ పరిధి టైరోడ్డు సమీపంలోని ఓ మఠం వద్ద
కృష్ణానదిలో తొలుత వేసిన రోడ్డు ఇది..
ఇసుకాసుర ‘హస్తం’..!
...తెలంగాణ–కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నారాయణపేట జిల్లాలోని కృష్ణా పరివాహకంలో ఇసుక మాఫియా ఆగడాలకు ఇవి నిదర్శనం. నదిలో మట్టి రోడ్లు వేసి మరి తెలంగాణ పరిధిలోని ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారు. పగలు, రాత్రనక యథేచ్ఛగా దందా కొనసాగుతున్నా.. రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్, పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
‘ఎత్తిపోతల’పై ప్రభావం..
కృష్ణానది ఆధారంగా మక్తల్ నియోజకవర్గంలో కుసుమూర్తి, వాసునగర్, గూడెబల్లూరు, ముడుమాల్, కొల్పూరు, పారేవులా, పస్పుల మినీ ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా దాదాపు 20 వేల ఎకరాలకు సాగు నీరందుతోంది. పలు ఎత్తిపోతల ద్వారా మే నెల వరకు తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. ప్రస్తుతం రబీ సీజన్ ముగిసింది. దీంతో పంటలకు అంతగా నీటి అవసరం లేకున్నా.. ప్రతి ఏటా ఇసుక తవ్వకాలు చేపడుతుండడంతో పంటల సాగుపై ప్రభావం చూపడంతో పాటు తాగు నీటికి ఇబ్బందులు వస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నదిలో రోడ్డేసి.. దర్జాగా తవ్వేసి..

నదిలో రోడ్డేసి.. దర్జాగా తవ్వేసి..

నదిలో రోడ్డేసి.. దర్జాగా తవ్వేసి..

నదిలో రోడ్డేసి.. దర్జాగా తవ్వేసి..