రోడ్డు భద్రత నియమాలపై అవగాహన
నాగర్‌కర్నూల్ క్రైం: ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రోడ్డు సురక్ష అభియాన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతపై కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించాలంటే డ్రైవర్‌పైన ఆధారపడి ఉంటుందని, ఎప్పుడైతే డ్రైవర్ అన్ని రోడ్డు భద్రత నియమాలను పాటిస్తారో అప్పుడే రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడపటం, నిర్ణీత వేగం కంటే ఎక్కువగా వెళ్లడం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల మనతోపాటు కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతారని అన్నారు. అనంతరం ఆర్టీసీ సిబ్బందితో రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ యాదయ్య, అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ అనూప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
36వ రోజు రిలే దీక్షలు
చారకొండ: డిండి– నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగమైన మండలంలోని గోకారం రిజర్వాయర్ నిర్మాణం సామర్థ్యం తగ్గించాలని ఎర్రవల్లిలో నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం 36వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ ఎర్రవల్లి, ఎర్రవల్లితండా ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆయా గ్రామాల మినహాయింపుపై జీఓ జారీ చేసే వరకు దీక్షలు కొనసాగిస్తామని తెగేసి చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల్లోసీపీఎం అభ్యర్థుల పోటీ
కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను పోటీలో నిలుపుతామని పార్టీ జిల్లా కార్యదర్శి పర్వతాలు అన్నారు. మంగళవారం ఆయన కొల్లాపూర్‌లో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం పార్టీ అనేక పోరాటాలు చేసిందని వివరించారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే సీపీఎం నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. సమావేశంలో మండల కార్యదర్శి శివవర్మ, నాయకులు తారాసింగ్, సలీం, వెంకట్, సంజీవ్, సాయికుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.
ముంపు బాధితులకు న్యాయం చేస్తాం
అచ్చంపేట రూరల్: మండలంలోని నక్కలగండి పునరావాస బాధితులకు ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని సిద్దాపూర్ పరిధి సర్వే నంబర్లు 192, 198లలో ఉన్న భూమిని పరిశీలించి.. ముంపు బాధితులతో అభిప్రాయ సేకరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. కొంత మంది బాధితులు అభ్యంతరాలను వెలిబుచ్చగా.. ఆయా అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ముంపు బాధితులకు అన్ని వసతులు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్ సైదులు, ఎంఆర్‌ఐ శివ, ఆర్‌ఐ బాల్‌రాం, ముంపు బాధితులు, సిద్దాపూర్ గ్రామ నాయకులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత నియమాలపై అవగాహన
రోడ్డు భద్రత నియమాలపై అవగాహన


