కేజీబీవీలో విద్యాప్రమాణాలు పెంపొందించాలి
కందనూలు: కేజీబీవీలో విద్యాప్రమాణాలు పెంపొందించాలని రాష్ట్ర బాలిక సమగ్ర అభివృద్ధి అధికారి డాక్టర్ శిరీష అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నీపా ఆధ్వర్యంలో సాధికారతపై నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల కేజీబీవీ ప్రత్యేకాధికారులకు ఐదు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా డాక్టర్ శిరీష, డీఈఓ రమేష్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష పథకం కింద పనిచేస్తున్న కేజీబీవీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన బాలికలకు నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. కేజీబీవీల నిర్వహణ, విద్యా ప్రమాణాల అమలు, విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ, పరిశుభ్రత, వసతి గృహాల నిర్వహణ వంటి అంశాల్లో ప్రత్యేకాధికారుల నైపుణ్యాలను మరింత బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉండాలని డాక్టర్.శిరీష అన్నారు.
ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
కస్తూర్బాల్లో బాలికల విద్యాభివృద్ధితో పాటు వారి ఆరోగ్యం, సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా, ఆధునిక పద్ధతులు అవలంబించేలా ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ రమేష్ అన్నారు. నేర్చుకున్న ప్రతి అంశాన్ని కేజీబీవీల్లో అమలు చేసి వాటి అభివృద్ధికి దోహదపడేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అసిస్టెంట్ జెండర్ కోఆర్డినేటర్ సతీష్‌కుమార్, జీసీడీఓ శోభారాణి, వనపర్తి జీసీడీఓ శుభలక్ష్మి, నాగర్‌కర్నూల్ ఎంఈఓ భాస్కర్‌రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు సూర్య చైతన్య, సూర్యాపేట జీసీడీఓ పుల్లమ్మ, సిద్దిపేట జీసీడీఓ నర్మద, పద్మ, సూర్యకళ, రెండు జిల్లాల కస్తూర్బా బాలికల విద్యాలయాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.


