పకడ్బందీగా ఓటరు జాబితా రూపొందించాలి
నాగర్‌కర్నూల్: రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మన్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని, కలెక్టర్లు, అధికారులతో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు 2వ సాధారణ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణ, ఇతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్ణీత తేదీల్లో ఎలక్ట్రోరల్ జాబితాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు, తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాలను ముందుగానే గుర్తించి, అవసరమైన మౌలిక వసతులు సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు సులభంగా చేరుకునేలా ఉండాలని, గుర్తింపు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో నామినేషన్ ప్రక్రియ, పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల రిజర్వేషన్లను నిబంధనల ప్రకారం ఖరారు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మున్సిపాలిటీల వార్డుల వారీగా వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా రూపొందించాలన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతినెలా నిర్వహిస్తున్న ఈవీఎం గోదాం తనిఖీల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఈవీఎంలు, వాటి భద్రతకు చేసిన ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అలారం వ్యవస్థ, లాక్స్, సీల్స్ తదితర సాంకేతిక అంశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలించాలని, సాంకేతిక లోపాలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గోదాములో ప్రవేశానికి సంబంధించి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, రిజిస్టర్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రవికుమార్, సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు ఉన్నారు.


