అక్రమ రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని రైతుల ఆందోళన
వెల్దండ: మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామానికి చెందిన కాన్గుల అంజయ్య, రవితో పాటు మరో 50 మందికి చెందిన భూమిని కొంతమంది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్లు ఆరోపిస్తూ బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపుగా 60 ఏళ్ల క్రితం తాము గ్రామంలోని సర్వే నంబర్ 351, 352లో గల భూమి కొనుగోలు చేశామని తెలిపారు. దానిపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు వారి వారసులమంటూ వచ్చిన కొందరు పోలీసుల సాయంతో తన పేరు మీద ఉన్న 12.23 గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారని వాపోయారు. విషయం తెలియడంతో బాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి కోర్టులో పెండింగ్‌లో ఉన్న భూమిని ఇతరులకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని అధికారులను ప్రశ్నించారు. భూమి రిజిస్ట్రేషన్ చేస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాలను లాగేసుకున్నారు. రెవెన్యూ అధికారులు ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ను వాయిదా వేయడంతో రైతులు ఆందోళన విరమించారు.


