మెరుగైన బోధన అందించాలి
తెలకపల్లి: విద్యార్థుల సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని జిల్లా మానిటరింగ్ అధికారి రఘురామరావు అన్నారు. బుధవారం మండలంలోని కమ్మరెడ్డిపల్లి, గౌరెడ్డిపల్లి పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తరగతిలో విద్యార్థుల సామర్థ్యాలు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన బోధన, నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. అయన వెంట జిల్లా అధికారి విజయలక్ష్మి, ఎంఈఓ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: నాగర్‌కర్నూల్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని ప్రభుత్వ చిల్డ్రన్స్ హోమ్ అచ్చంపేటలో ఖాళీగా ఉన్న పని మనిషి, నైట్ వాచ్‌మెన్ పోస్టులను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మౌఖిక పరీక్ష ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు జూలై 1, 2025 నాటికి కనిష్ట వయస్సు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లు కలిగి ఉండాలని, దరఖాస్తుకు ఈ నెల 17వ తేదీలోపు జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో దర ఖాస్తు సమర్పించాలని కోరారు.
నేడు డయల్ యువర్ డీఎం
కల్వకుర్తి టౌన్: ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గాను డిపో పరిధిలో గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా డీఎం సుభాషిణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి గంట పాటు కార్యక్రమం ఉంటుందని, ఫోన్ చేసే వారు 99592 26292 నంబర్‌లో సంప్రదించాలని ఆమె సూచించారు.


