పాలమూరును ఎడారి చేసే కుట్ర
సాక్షి, నాగర్‌కర్నూల్/ కొల్లాపూర్/ అమరచింత/ కొల్లాపూర్ రూరల్: కేవలం 9 టీఎంసీల సామర్థ్యం గల జూరాల నుంచి కొడంగల్, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు కృష్ణా నీటిని తరలించి పాలమూరును ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి అన్నారు. నాటి నుంచి నేటి వరకు పాలమూరుకు అన్యాయం జరగడానికి కాంగ్రెస్‌దే పాపం అన్నారు. బీఆర్‌ఎస్ జలపోరులో భాగంగా జూరాల, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను మంగళవారం ఉమ్మడి జిల్లాలోని బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనలో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు ముందుకు సాగలేదని విమర్శించడం సరికాదన్నారు. జూరాలలో నీటి నిల్వలను కాపాడుకునే ప్రయత్నం చేయలేని సీఎం రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ప్రచారం తెరపైకి తెచ్చారన్నారు. వేసవి రాక ముందే జూరాలలో నీటి నిల్వలు అడుగంటాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు ఇవ్వలేక క్రాప్ హాలీడే ప్రకటించడమే ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అన్నారు. కేవలం 9 టీఎంసీల సామర్థ్యం కలిగిన జూరాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి తరలించేలా పనులు ప్రారంభించి 90 శాతం పూర్తిచేశారని చెప్పారు. ప్రస్తుతం మిగులు పనులు చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి నీటి కొరత ఉంటుందనే సాకుతో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటి తరలింపు దండగని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరు జిల్లా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత నష్టపోయిందని అలాంటి జిల్లాలో సాగునీటితోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కృష్ణానది జలాలు వందశాతం వాడుకునే హక్కు పాలమూరుకే ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
90 శాతం పూర్తయినప్రాజెక్టుపై నిందలా
జూరాల నుంచి కొడంగల్‌కు నీటి పంపింగ్ ఎలా సాధ్యమవుతుంది
సీఎం, మంత్రులకు ‘పాలమూరు’పై కనీస అవగాహన లేదు
ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో మాజీ మంత్రుల ధ్వజం


