
ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
నాగర్‌కర్నూల్ క్రైం: అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి నిర్వహించిన వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. వారం రోజులపాటు జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజవర్గాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాకేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో వ్యాసరచన పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఫైర్ ఆఫీసర్ కృష్ణమూర్తి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో లీడింగ్ ఫైర్‌మెన్లు వహీదుద్దీన్, రంగస్వామి, సిబ్బంది ఖదీర్, మల్లేష్, వెంకటేశ్వరరావు, కై ఫ్, సాయిబాబ, అమరేందర్ పాల్గొన్నారు.
స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్రంలో దివ్యాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ చౌరస్తాలోని రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ణగారిన వర్గాలలో ఉన్న దివ్యాంగులు అధికారం కలిగిన సంస్థల్లో భాగం కావడానికి చట్టపర అధికారాలతో స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
20 మంది టీచర్లకు స్పౌజ్ బదిలీలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: 317 జీఓలో గతంలో ఇబ్బందులకు గురైన స్పౌజ్ ఉపాధ్యాయులకు త్వరలో బదిలీ చేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారు గతంలో తమకు బదిలీ చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం ఈ అంశంపై నిర్ణయం తీసుకుని బదిలీలకు ఆమోదం తెలిపింది. మొత్తంగా మహబూబ్‌నగర్ జిల్లాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 20 మంది బదిలీపై రానున్నారు. పాత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల జిల్లాల నుంచి మహబూబ్‌నగర్‌కు బదిలీ కానున్నారు. కాగా 8 మంది టీచర్లు ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ కానున్నారు. ఇటీవల డీఎస్సీ ద్వారా ప్రభుత్వం చాలా పోస్టులు భర్తీ చేసింది. ఖాళీలు ఎక్కువ లేని క్రమంగా మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చే ఉపాధ్యాయులకు బై పోస్టుల కింద భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ విషయంపై డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. 20 మంది ఉపాధ్యాయులకు అన్ని పరిశీలించి ఈ నెల 22లోగా బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.