
‘భూ భారతి’తో భూ సమస్యల పరిష్కారం
తాగునీటి సరఫరాకు
ముందస్తు చర్యలు
నాగర్‌కర్నూల్: వేసవి నేపథ్యంలో జిల్లాలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వేసవిలో తాగునీటి సరఫరా తదితర అంశాలపై అదనపు కలెక్టర్ దేవసహాయం, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సరఫరాపై మున్సిపల్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులతో కలిసి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలని, నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చూడాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీఓ చిన్న ఓబులేషు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్ పాల్గొన్నారు.
వంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టంతో భూ సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం వంగూరు రైతువేదికలో నిర్వహించిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘భూ భారతి’ నూతన ఆర్‌ఓఆర్ చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. భూ భారతి చట్టం ద్వారా రికార్డులలోని తప్పొప్పులను క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ద్వారా సవరించుకునే అవకాశం ఉందన్నారు. ఈ చట్టంపై నిర్వహించే అవగాహన సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జూన్ 2 నుంచి ఆన్‌లైన్‌లో భూభారతి చట్టం పోర్టల్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు మీసేవలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే చలాన్ ద్వారా చెల్లించిన మొత్తాన్ని తిరిగి బాధితులకు ఇస్తారన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూ భారతి చట్టంలోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్‌డేట్ చేస్తారన్నారు. ‘భూ భారతి’ నూతన ఆర్‌ఓఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరిచి నూతన చట్టాన్ని తెచ్చిందన్నారు. రైతు కమిషన్ సభ్యుడు కేవీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగం ధరణి ద్వారా తమ భూ రికార్డులలో ఎదుర్కొన్న అనేక సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక భూ రికార్డుల చట్టం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ మురళీమోహన్ పాల్గొన్నారు.