
గ్రామ పాలనాధికారి కొలువులపై ఆశలు
అచ్చంపేట: గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గ్రామ పాలనాధికారి (జీపీఓ) పేరిట కొత్త అధికారుల నియామకానికి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయగా.. ఇందుకనుగుణంగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శి గత నెల 29న జీఓ 129 విడుదల చేశారు. ఈ జీఓ ప్రకారం గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)లుగా పనిచేసి వేరే శాఖల్లోకి వెళ్లిన వారు తిరిగి మాతృ శాఖలోకి వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చిన వారిని మాత్రమే ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. వీరికి కూడా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. రెవెన్యూ శాఖలోకి వచ్చే వారికి కామన్ సీనియార్టీ వర్తించదని, సర్వీస్ మళ్లీ మొదటి నుంచే లెక్కిస్తారని ప్రభుత్వం జీఓలో స్పష్టం చేసింది. ఈ నిబంధనలపై వీఆర్వో, వీఆర్‌ఏల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గూగుల్ ఫాం ద్వారా తమ ఆప్షన్లను మరోసారి ఈ నెల16 వరకు తెలియజేయాలని భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. కాగా.. గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు స్వీకరించగా.. 245 మంది అంగీకరించారు. అయితే ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం డిగ్రీ లేదా ఇంటర్ పూర్తి చేసినవారు మాత్రమే అర్హులు. గతంలో ఆప్షన్లు ఇచ్చిన వారిలో ఇంటర్ విద్యార్హత లేని వారు కూడా ఉన్న నేపథ్యంలో.. తాజాగా డిగ్రీ, ఇంటర్ చదివిన వారికి మాత్రమే ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు.
ఇతర శాఖల్లో సర్దుబాటు అయిన వారు..
జిల్లాలో 450 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. భూ వివాదాలు, ధ్రువపత్రాల జారీ, విపత్తుల సాయం, లబ్ధిదారుల ఎంపిక వంటి వాటిపై గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలు క్షేత్రస్థాయిలో విచారణ చేసేవారు. అయితే గత ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా 2022 ఆగస్టు 1న 176 మంది వీఆర్వోలను 25 శాఖల్లో సర్దుబాటు చేయగా, ఏడాది తర్వాత 2023 ఆగస్టు 10న 502 మంది వీఆర్‌ఏలను నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని 18 శాఖలకు కేటాయిస్తూ సర్వీసును క్రమబద్ధీకరించింది. మిగులు సిబ్బంది పేరిట ఇతర జిల్లాల్లో విధుల్లో చేరారు. అయితే ఈ ఏడాది జనవరిలో ప్రస్తుత ప్రభుత్వం ఇతర శాఖల్లో సర్దుబాటు అయిన వారి నుంచి మాతృ శాఖకు వచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో గ్రామస్థాయి పాలనాధికారి కోసం 228 మంది, సర్వేయర్‌కు 17 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 121 మంది వీఆర్వోలు, 124 మంది వీఆర్‌ఏలు ఉండగా.. పీజీ ఇద్దరు, బీటెక్ ముగ్గురు, 99 మంది డిగ్రీ, 42 మంది ఇంటర్, 99 మంది ఇంటర్‌లోపు అర్హత కలిగిన వారు ఉన్నారు.
పూర్వపు వీఆర్‌ఓ,
వీఆర్‌ఏలకు ప్రాధాన్యం
మార్గదర్శకాలు
విడుదల చేసిన ప్రభుత్వం
రెవెన్యూ శాఖలో చేరేందుకు
ఆప్షన్లు ఇచ్చిన వారే అర్హులు
ఈ నెల 16 వరకు గూగుల్
ఫాం ద్వారా మరో అవకాశం
మార్గదర్శకాలు సవరించాలి
జీపీఓ పోస్టుల కోసం పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను సవరించాలి. జీఓ 129లో మార్పులు చేయాలి. ఈ నెల 16 వరకు రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేయకపోతే వీఆర్వో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. ఎలాంటి పరీక్ష లేకుండా మళ్లీ రెవెన్యూలోకి తీసుకొని కామన్ సీనియార్టీ వర్తింపజేయాలి. విద్యార్హత, చివరి తేదీ నిబంధనలు కూడా తొలగించాలి.
– వెంకటేష్, పూర్వ వీఆర్‌ఓల
సంఘం జిల్లా అధ్యక్షుడు
పునరాలోచనలో..
జీపీఓ పోస్టుల కోసం ప్రభుత్వం జనవరిలో పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు తీసుకుంది. అయితే ఇప్పుడు మరోసారి గూగుల్ ఫాం ద్వారా ఆప్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరడంతో పూర్వ వీఆర్‌ఓ, వీఆర్‌ఏల్లో చర్చ మొదలైంది. జీఓ 129 మార్గదర్శకాల ప్రకారం పాత సర్వీసును పరిగణలోకి తీసుకోమని చెప్పడంతో ఆప్షన్లు ఇచ్చిన వారు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ప్రస్తుతం పనిచేస్తున్న శాఖలను వదులుకొని రెవెన్యూలోకి వెళ్తే వచ్చే ప్రతిఫలం ఏమిటని ఆలోచిస్తున్నారు. జీరో సర్వీస్ కాకుండా తాము ఉద్యోగంలో చేరిన నాటిని నుంచి పరిగణిస్తే తప్ప వెళ్లడానికి సుముఖంగా కనిపించడం లేదు. ఈ క్రమంలో జీపీఓ పోస్టులకు ఎంత మంది గూగుల్ ఆప్షన్లు ఇస్తారో వేచి చూడాలి. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో 9 రకాల విధులు రూపొందించారు. అవన్నీ గతంలో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు ఉన్నప్పుడు నిర్వహించినవే కావడం గమనార్హం.