నాలుగు రోజుల పాటు మినీ జాతర
కూడళ్లలో ఏర్పాటు చేసిన కళాకృతులు
మారిన
మేడారం..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం నూతన హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా చేపట్టిన పునర్నిర్మాణం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, ప్రహరీ నిర్మాణం, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ ఏడాది మహాజాతర జనవరి 28 నుంచి ప్రారంభమైంది. అయితే అప్పటికీ గద్దెల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో పూర్తికాలేదు. మహాజాతరకు కోట్లాది మంది భక్తులు తరలిరావడంతో ప్రధానంగా అమ్మవార్ల దర్శనంపైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. గద్దెల చుట్టూ రాతితో నిర్మించిన ప్రహరీని ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో మినీ జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపించనుంది.
ఆదివాసీల సంస్కృతికి పెద్దపీట
మేడారం అభివృద్ధి పనుల్లో కేవలం భవనాలు, రహదారులు, మౌలిక వసతులకే పరిమితం కాకుండా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. మేడారం పరిసర ప్రాంతాల్లోని పలు జంక్షన్లను కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఆదివాసీల జీవన విధానం, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించేలా వివిధ రకాల బొమ్మలు, ఆకృతులను ఏర్పాటు చేశారు. జంక్షన్లలో ఏర్పాటు చేసిన ఈ కళా కృతులు మేడారం వచ్చే ప్రతిఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ కళా కృతులతో మేడారం పరిసర ప్రాంతాలకు ప్రత్యేక శోభ వచ్చింది.
కొత్త రూపంలో మేడారం
మహాజాతర సమయంలో భక్తుల రద్దీ కారణంగా మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తిగా ఆస్వాదించే అవకాశం లేకపోయినా.. ఇప్పుడు పరిస్థితి మారింది. అభివృద్ధి పనులు పూర్తికావడంతో గద్దెల ప్రాంగణం కొత్త రూపును సంతరించుకుంది. జంక్షన్లలో ఏర్పాటు చేసిన కళాకృతులు మేడారం ప్రత్యేకతను మరింత పెంచుతున్నాయి. మినీ జాతర సందర్భంగా వచ్చే భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు మేడారంలో ఏర్పాటు చేసిన బొమ్మలు, కళాకృతులు, నూతనంగా పనులు చేపట్టిన వనదేవతల గద్దెల ప్రాంగణ నిర్మాణాలను ప్రశాంతంగా వీక్షించే అవకాశం లభించనుంది.
నూతన హంగులతో ముస్తాబైన గద్దెల ప్రాంగణం
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు
ఆకట్టుకుంటున్న జంక్షన్లలో
ప్రత్యేక కళాకృతులు
మినీ జాతరలో ప్రశాంతంగా
వీక్షించే అవకాశం
వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు మినీ జాతర
వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మినీ జాతర ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పూజారులు ప్రకటించారు. మినీ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. మహాజాతరతో పోలిస్తే భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో భక్తులకు మేడారం కొత్త అందాలను ప్రశాంతంగా వీక్షించే అవకాశం లభించనుంది. మినీ జాతరకు వచ్చే భక్తులు అమ్మవార్ల దర్శనంతో పాటు నూతనంగా నిర్మించిన గద్దెల ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో చూసి ఆనందించవచ్చు. గద్దెల చుట్టూ నిర్మించిన ప్రహరీ, నూతన నిర్మాణాలు, ఆదివాసీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆకృతులను దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. అలాగే మేడారం ప్రధాన జంక్షన్లలో ఏర్పాటు చేసిన ఆదివాసీ సంస్కతి, సంప్రదాయాల బొమ్మలను సైతం ప్రశాంతంగా వీక్షించవచ్చు.


