ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం మేడారానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి చేరుకుని జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. కల్యాణకట్టలో భక్తులు అమ్మవార్లకు పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, ఒడి బియ్యం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. యాటలను, కోళ్లను మొక్కుగా సమర్పించారు. అనంతరం మేడారం పరిసరాల్లో చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు.


