కసరత్తు షురూ | - | Sakshi
Sakshi News home page

కసరత్తు షురూ

Sep 28 2026 1:23 AM | Updated on Sep 28 2026 1:23 AM

ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్‌

ఓటర్ల నమోదుకు షెడ్యూల్‌ ఇదీ..

పట్టభద్రుల ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. సోమవారం ఓటర్ల నమోదుకు నోటీసు వెలువడనుంది. నవంబర్‌ 6 వరకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. నవంబర్‌ 25న ముసాయిదా జాబితా, డిసెంబర్‌ 30న తుది జాబితా ప్రకటించనుంది. దీంతో అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. గతంలో ఓటు ఉన్నవారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండడంతో ప్రధాన పార్టీలు ఈ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి.

సాక్షిప్రతినిధి, వరంగల్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియకు షెడ్యూల్‌ ప్రకటించడంతో పార్టీలు ఆ పనిలో నిమగ్నమవుతున్నాయి. ఓటర్లను పెంచుకోవడం, తమకు అనుకూలమైన, గెలిచే అవకాశమున్న అభ్యర్థిని బరిలోకి దించడం లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్‌ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది.

కాంగ్రెస్‌లో టికెట్‌ ఫైట్‌!

అధికార కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టికెట్‌ కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గుత్తా అమిత్‌రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, పీవీ శ్రీనివాస్‌, చనగాని దయాకర్‌, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి, సింగాపురం ఇందిర పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి మరికొందరు నేతలు కూడా అవకాశం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

బీఆర్‌ఎస్‌ గురి..

గత ఎన్నికల్లో కోల్పోయిన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఆ పార్టీ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులతో సంబంధాలు పెంచుకోవడంపై పార్టీ అధిష్టానం సైతం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికతో పాటు ఓటర్ల నమోదు కూడా కీలకం కానుంది.

బీజేపీ కసరత్తు

పట్టభద్రుల నియోజకవర్గంలో తమ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ కూడా సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్‌ గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి రెండుసార్లు వరుస ఓటమికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మూడోసారి టికెట్‌ ఆశిస్తున్నా పార్టీ నాయకత్వం గెలుపు గుర్రాలపై దృష్టి పెట్టినట్లు పార్టీవర్గాల సమాచారం. ఎస్‌.ప్రకాశ్‌రెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, నూకల నర్సిరెడ్డి, రాణి రుద్రమ, కాసం వెంకటేశ్వర్లు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

నిరుద్యోగమే ప్రధాన అస్త్రం..

ఈ ఎన్నికలో నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు, ఉద్యోగుల సమస్యలు ప్రధాన చర్చకు వచ్చే అవకాశం ఉంది. పట్టభద్రుల సమస్యలపై ఎవరు గట్టిగా మాట్లాడతారు? ఎవరు వారి మద్దతు కూడగడతారు? అనేది కీలకం కానుంది. కాగా, ఉమ్మడి వరంగల్‌ ఆరు జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్ల నమోదు, ప్రచార కార్యక్రమాలపై ప్రధాన పార్టీలు నేటి నుంచి దృష్టి పెట్టనున్నాయి. ఓటర్ల జాబితాలో కొత్తగా ఎంతమంది చేరతారు? అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి సమీకరణాలు తెరపైకి వస్తాయి? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలపై

మూడు పార్టీల గురి

గెలుపు గుర్రాల వేటలో కాంగ్రెస్‌,

బీఆర్‌ఎస్‌, బీజేపీ

టికెట్‌ కోసం ఆశావహుల ప్రయత్నాలు

నిరుద్యోగం, ఉద్యోగాలే ప్రధాన అస్త్రాలు

నేడు ఓటర్ల నమోదుకు ఈసీ నోటీసు

కార్యక్రమం తేదీ

ఓటర్ల నమోదుకు నోటీసు సెప్టెంబర్‌ 28, 2026

పత్రికల్లో పునఃప్రకటన అక్టోబర్‌ 15, 25

అర్హత తేదీ నవంబర్‌ 1

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నవంబర్‌ 6

ముసాయిదా ఓటర్ల జాబితా నవంబర్‌ 25

అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ నవంబర్‌ 25–డిసెంబర్‌ 10

తుది ఓటర్ల జాబితా డిసెంబర్‌ 30

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement