వాజేడు: ఇసుక వాగు వద్ద నీటి ప్రవాహం, జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు
వాజేడు/కన్నాయిగూడెం: వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి, పెద్ద గొళ్లగూడెం గ్రామాల మధ్యన ఇసుక వాగు వద్ద డైవర్షన్ రోడ్డు గతంలో వచ్చిన వర్షాల కారణంగా కొట్టుకు పోయింది. దీంతో రహదారి సౌకర్యం లేకుండాపోయింది. గోదావరి వరద నెమ్మదిగా తగ్గుతున్నప్పటికీ రహదారి ఇంకా బయట పడలేదు. ఇసుక వాగు వద్ద భారీ ఎత్తున నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇసుక వాగు బ్రిడ్జికి రెండు వైపులా భారీ ఎత్తున లారీలు, బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. 163 జాతీయ రహదారిపై ఇసుక వాగు వద్ద రహదారి విస్తరణ పనుల్లో భాగంగా బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు వాగు అవతలి వైపున ఉన్న 25 గ్రామాలకు రహదారి సౌకర్యం లేకుండా పోయింది. గోదావరి వరద మూలంగా ఇసుక వాగు వద్ద డైవర్షన్ రహదారి మునిగిన విషయం తెలియక చాలా మంది ప్రయాణికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు అధికారులు శనివారం, ఆదివారం నాటు పడవలను ఏర్పాటు చేసి రెండు వైపులా ఉన్న ప్రయాణికులను ఇసుక వాగు వద్ద గోదావరి దాటిస్తున్నారు. ఇసుక వాగు వద్ద పరిస్థితిని ఎస్సై సతీష్ పరిశీలించారు. అదే విధంగా మిర్చి పంటలను ముంచేసిన వరద ఇంకా వీడదం లేదు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత తోటల పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్చి మొక్కలు చనిపోతే నారు ఎక్కడ కొనాలనే ఆలోచన చేస్తున్న పరిస్థితి నెలకొంది. టేకులగూడెం వద్ద నీట మునిగిన జాతీయ రహదారి బయట పడినప్పటికీ వాజేడు, గుమ్మడి దొడ్డి గ్రామాల మధ్యన కొంగాల వాగు వద్ద రోడ్డుపైకి చేరిన గోదావరి ఇంకా తగ్గుముఖం పట్టలేదు. దీంతో ఆయా గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచి పోయాయి. అలాగే ఇసుకవాగు అవతలివైపు గ్రామానికి చెందిన ఓ యువకుడు పురుగుల మందుతాగడంతో అతడిని నాటుపడవలో దాటించి ఏటూరునాగారం వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యం చేయడంతో ప్రస్తుతం అతను బాగానే ఉన్నట్లు సమాచారం. అలాగే కన్నాయిగూడెం మండల పరిధిలోని చింతగూడెం, ఏటూరు, సింగారం, బుట్టాయిగూడెం, ముప్పనపల్లి, గూర్రేవులతో పాటు పలు గ్రామాల్లోని మిర్చి తోటలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. ప్రమాదం ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీటిలోని మిర్చి పంటను చూపిస్తున్న రైతు
ఇసుకవాగు వద్ద భారీగా నీటి ప్రవాహం
నాటు పడవ ద్వారా ప్రయాణికుల
తరలింపు
నీటిలోనే మిర్చి తోటలు


